కాళేశ్వరం/ భూపాలపల్లిటౌన్/ గణపురం, ఏప్రిల్15 : ‘ప్రాణహిత’లో పుష్కర స్నానం చేసి పునీతమయ్యేందుకు భక్తజనం కాళేశ్వరానికి పోటెత్తుతున్నది. మూడో రోజు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద పుణ్యస్నానాల కోసం సుమారు 30వేల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారయంత్రాంగం తెలిపింది. త్రివేణీ సంగమం ఆవల ప్రాంతాన గల ప్రాణహిత నదిలో పుష్కర స్నానాలు చేసి, సైకత లింగాలను పూజించి అనంతరం కాళేశ్వరంలో కాళేశ్వర, ముక్తీశ్వరుల దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు.
దేవస్థానంలో ఉన్న యమకోణంలోంచి దాటేందుకు క్యూ కడుతున్నారు. ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అర్జునగుట్టకు వేలాదిగా వస్తున్న భక్తులు సైతం అక్కడ ప్రాణహితలో స్నానాలు చేసి గోదావరి వంతెన మీదుగా కాళేశ్వరం చేరుకొని స్వామివారల దర్శనం చేసుకొని ఒకరోజు ఇక్కడే బస చేసి తిరుగుముఖం పడుతున్నారు. మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి శుక్రవారం అర్జునగుట్ట మీదుగా కాళేశ్వరం చేరుకొని ప్రాణహితలో పుష్కర స్నానాలు చేసి స్వామివారలను దర్శించుకున్నారు. తెలంగాణతోపాటు, ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు తరలివస్తుండగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను దారి మళ్లించడం ద్వారా చాలామంది భక్తులు కాళేశ్వరం రాకుండా గోదావరి వంతెన మీదుగా మహారాష్ట్ర వైపు ఉన్న ప్రాణహిత నదికి వెళ్లాల్సి వస్తున్నదని వాపోతున్నారు. వాహనాలకు సడలింపు ఇస్తే కాళేశ్వరం దేవస్థానాన్ని కూడా దర్శించుకునే వీలు కలుగుతుందని అధికారులను కోరుతున్నారు. కాగా, భక్తుల కోసం మాజీ జడ్పీటీసీ, పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి కాళేశ్వరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో ఆలయ ఈవో మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాణహితలో పుష్కర స్నానాలు చేసి, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివారలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో కాళేశ్వరం కిటకిటలాడుతున్నది. పుష్కరాల్లో భాగంగా శుక్రవారం 30వేలమందికి పైగా భక్తులు తరలిరాగా నదీతీరం పులకించిపోయింది. త్రివేణీ సంగమం ఆవల అర్జునగుట్ట వద్ద ప్రణీత నదిలో స్నానాలు చేసి భక్తులు కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు చేసి తిరుగుపయనమవుతున్నారు. ట్రాఫిక్‌తో పాటు ఇతర ఇబ్బందులు కలుగకుండా అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
– కాళేశ్వరం