Sweet Corn | స్వీట్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. దీనితో రకరకాల చిరుతిళ్లను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. స్వీట్ కార్న్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చాలా మంది దీనిలో ఎక్కువగా పిండి పదార్థాలే ఉంటాయని భావిస్తారు. కానీ వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. అయితే చాలా మంది దీనికి దూరంగా ఉంటారు. దీనిలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయని దీనిని తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతుందని చాలా మంది భావిస్తారు. కానీ దీనిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని ఉడికించి లేదా తేలికగా కాల్చి తీసుకున్నప్పుడు మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలను పొందగలమని నిపుణులు చెబుతున్నారు. స్వీట్ కార్న్ ను ఉడికించి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ కార్న్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మద్దతును ఇస్తుంది. ప్రేగు కదలికలు పెరుగుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. దీనిలో ఉండే కరగని ఫైబర్ జీర్ణక్రియకు మద్దతును ఇస్తుంది. దీంతో గట్ మైక్రోబయోమ్ పోషకాల శోషణను పెంచుతుంది. స్వీట్ కార్న్ లో జియాక్సంతిన్, లుటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి కణ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, కంటి వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రాకుండా చేయడంలో సహాయపడతాయి. స్వీట్ కార్న్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటుంది. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. కనుక శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. పిల్లలు, ఆటలు ఎక్కువగా ఆడేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
వీటిలో ఫైబర్ తో పాటు పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. స్వీట్ కార్న్ ను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. స్వీట్ కార్న్ లో కెరోటినాయిడ్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయసు సంబంధిత మాక్యులర్ క్షీణత, అంధత్వం, దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. స్వీట్ కార్న్ లో డైటరీ ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆకలి ఎక్కువ సమయం వరకు కాకుండా ఉంటుంది. దీంతో తక్కువ ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది శరీర బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఈ విధంగా స్వీట్ కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకునే ప్రయత్నం చేయాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని ఉడికించి లేదా కాల్చి తీసుకోవాలని, వీటిని ఉప్పు, వెన్న, కారం, మసాలా వంటి వాటితో కలిపి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.