– సేవాలాల్ జయంతి నిర్వహణకు వర్సిటీ అధికారుల నిరాకరణ
– దీంతో ప్రధాన గేటుకు తాళం వేసి విద్యార్థుల నిరసన
రామగిరి, ఫిబ్రవరి 21 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గిరిజన విద్యార్థులు తమ ఆరాధ్య దైవమైన సంతు సేవాలాల్ జయంతిని నిర్వహించుకుంటామని వర్సిటీ అధికారులకు తెలిపినప్పటికీ అనుమతించకుండా తమ హక్కులను కాలరాస్తూ సేవాలాల్ జయంతిని అవమానించారనే ఆరోపణలతో యూనివర్సిటీ మెయిన్ గేటుకు తాళం వేసి ఎస్టీ విద్యార్థులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. అనుమతి లేకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తే కేసులు పెడుతామని రిజస్ట్రార్తో పాటు అధికారులు హెచ్చరించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు ఉదయం 10 గంటల నుండే యూనివర్సిటీ మెయిన్ గేట్‌కు తాళం వేసి ఎస్టీ విద్యార్థులు అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ యూనివర్సిటీకి వచ్చి వర్సిటీ వీసీతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం వీసీ స్వయంగా మెయిన్ గేట్ వద్దకు వచ్చి విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విద్యార్థులు తమ డిమాండ్లను నెరవేర్చాలని, గిరిజన విద్యార్థుల హక్కులను కాపాడాలని, సేవాలాల్ జయంతిని గౌరవప్రదంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న సంఘటనలపై అధికారులు స్పందించక పోవడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారాలు చూపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఎంజీయూలో ఎస్టీ విద్యార్థుల ఆందోళన