హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక అవసరాలు, సంక్షేమ పథకాల అమలు పేరిట పదే పదే అడ్డగోలుగా అప్పులు తెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి మరో రూ.2 వేల కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించింది. అందుకోసం తాజాగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తలుపు తట్టింది. ఈ నెల 18న సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ అప్పు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది.
ఇందులో 11 ఏండ్ల కాల పరిమితితో రూ.1,000 కోట్లు, 29 ఏండ్ల కాలపరిమితితో మరో రూ.1,000 కోట్లు సమీకరించనున్నట్టు తెలిపింది. దీంతో రేవంత్రెడ్డి సర్కార్ ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో కనీసం 5 నెలలు కూడా పూర్తికాకముందే ఆర్బీఐ నుంచి రూ.36,900 కోట్ల రుణాలు తెచ్చినట్టవుతుంది. ఇది రాష్ట్ర వార్షిక రుణ పరిమితిలో రూ.80 వేల కోట్లలో ఏకంగా 44 శాతానికి సమానం. దీనిపై ఆర్థిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
