Project Cheetah : ఒకప్పుడు దేశంలో అంతరించిపోయిన చీతాలు ఇప్పుడు మళ్లీ తమ సంతతిని పెంచుకుంటున్నాయి. చీతాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ చీతా ఇప్పుడు విజయవంతమైనట్లు కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం 8 చీతాల్ని నమీబియా నుంచి దేశంలోకి తీసుకురాగా.. ఇప్పుడు వాటి సంఖ్య 52కు చేరింది. అంటే, చీతాల సంఖ్య దేశంలో ఎలా వృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో చీతాలు 1952లోనే అంతరించిపోయాయి.
అలాంటి చీతాల్ని మళ్లీ ఇండియాలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ప్రాజెక్ట్ చీతా ప్రారంభించింది. ఇందుకోసం చీతాలు ఎక్కువగా ఉండే నమీబియాతో కేంద్రం సంప్రదింపులు జరిపింది. నమీబియా నుంచి 8 చీతాల్ని ఇండియా తీసుకొచ్చింది. మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 17, 2022న ప్రధాని ఈ చీతాల్ని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో విడిచిపెట్టారు. ఈ చీతాలు ఇండియాలోకి వచ్చి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తైంది. ఇప్పుడు వీటి సంఖ్య 52కు చేరింది. వీటిలో ఇండియాలో జన్మించిన చీతాలే 32 ఉన్నాయి.
మొత్తం చీతాల్లో 49 చీతాలు కూనో నేషనల్ పార్కులోనే ఉన్నాయి. మరో మూడు మధ్యప్రదేశ్లోని గాంధీ నగర్ శాంక్చువరీలో ఉన్నాయి. వీటిని అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆరోగ్యం, ఆహారం, భద్రత వంటి అంశాల్ని పరిశీలిస్తున్నారు. చీతాల్ని ఇండియా తీసుకొచ్చిన కొత్తలో కొన్ని మరణించాయి. ఇండియాలో జన్మించిన కొన్ని చీతాలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. దీంతో ప్రాజెక్ట్ చీతాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఇప్పుడు వీటి సంఖ్య 8 నుంచి 52కు చేరిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నట్లే లెక్క.
ఇది చీతాలకే కాదు.. దేశంలో అంతరించిపోయిన ఇతర జీవుల్ని ప్రవేశపెట్టేందుకు కూడా సహకరిస్తుంది. ఇతర జంతువులు ఇండియాలోని వాతావరణ పరిస్థితుల్ని ఎలా తట్టుకుంటాయి అనే అంశంపై అవగాహన పెంచుకోవడానికి ఈ ప్రాజెక్ట్ సహకరించింది. దేశంలో జంతువుల సమతుల్యత పాటించేందుకు కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది.