హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురసరించుకుని కేంద్రప్రభుత్వం ప్రకటించిన విశిష్ట సేవా పతకాల జాబితాలో రాష్ట్రానికి చెందిన పలువురు పోలీసు, ఫైర్, హోమ్‌గార్డ్ సిబ్బంది స్థానం సంపాదించారు. ఈసారి మన రాష్ట్రానికి చెందిన ముగ్గురికి శౌర్య పతకాలు(జీఎం), ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు(పీఎస్ఎం), 13 మందికి ప్రతిభా సేవా పతకాలు (ఎంఎస్ఎం) లభించాయి.
కేంద్ర ప్రభుత్వం పోలీసు, ఫైర్, హోమ్గార్డ్స్ అండ్ సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1,057 పతకాలను ప్రకటించింది. వీటిల్లో గ్యాలెంట్రీ మెడల్స్ పోలీసుశాఖకు 272 రాగా, ఫైర్ విభాగానికి 29 లభించాయి. పీఎస్ఎం మెడల్స్ పోలీసుశాఖకు 83, ఫైర్ విభాగానికి 4, హోమ్గార్డ్స్ విభాగానికి 3, కరెక్షనల్ సర్వీసెస్‌కు 2 దక్కాయి. ఎంఎస్ఎం మెడల్స్ పోలీసుశాఖకు 606, ఫైర్ విభాగానికి 28, హోమ్గార్డ్స్కు 18, కరెక్షనల్ సర్వీసెస్‌కు 12 దక్కాయి. మొత్తం 301 శౌర్య, 92 రాష్ట్రపతి విశిష్ట సేవా, 664 ప్రతిభా సేవా పతకాలు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించింది.
తెలంగాణ నుంచి శౌర్య, రాష్ట్రపతి, ప్రతిభా పతకాలకు ఎంపికైన 18 మందికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్, గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ డీజీ అనిల్‌కుమార్, టీజీఎస్పీ బెటాలియన్స్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, హోమ్గార్డ్స్ డీజీ స్వాతీలక్రా అభినందించారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ ఎస్పీ జగదీశ్వర్‌రెడ్డికి ‘రాష్ట్రపతి పోలీస్ పతకం’ రావడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
రేగట్టే గోపాల్‌రెడ్డి కుమారుడైన జగదీశ్వర్‌రెడ్డి 1969 జూన్ 10న జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ పొలిటికల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పోలీస్ శాఖలో తన సర్వీసు కాలంలో విధి నిర్వహణలో ప్రదర్శించిన నిబద్ధత, వృత్తి నైపుణ్యానికి ఆయన గతంలోనూ అనేక పురసారాలు అందుకున్నారు. 2005లో కఠిన సేవా పతకం, 2009లో ఉత్తమ సేవా పతకం, 2011లో ముఖ్యమంత్రి శౌర్య పతకం, 2014లో ఆంత్రిక్ సురక్షా సేవా పతకం, 2017లో ఇండియన్ పోలీస్ మెడల్, 2021లో మహోన్నత సేవా పతకాలను స్వీకరించారు.
అంతేకాకుండా 2006లో ఓ ఉగ్రవాదిని బంధించడంలో చూపిన ప్రతిభకుగానూ సీబీఐ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. వీటితో పాటు ఆయన సర్వీసు రికార్డులో ఉత్తమ పనితీరుకుగానూ 85 కమెండేషన్ ఎంట్రీలు, 8 ప్రశంసా పత్రాలు, 2 ప్రత్యేక కమెండేషన్లు నమోదయ్యాయి. రాష్ట్రపతి పోలీస్ పతకానికి ఎంపికైన ఎస్పీ జగదీశ్వర్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు అభినందించారు.
ఫేమ్ ఇండియా, ఏషియా పోస్ట్ సంయుక్తంగా నిర్వహించిన టాప్-100 పోలీసుల జాబితాలో తెలుగు రాష్ర్టాలకు చెందిన ఇద్దరు ఎస్పీలకు చోటుదక్కింది. వారు తెలంగాణ బిడ్డలే అయినా ఒకరు అసోం క్యాడర్, మరొకరు ఒడిశా క్యాడర్‌కు విధులు నిర్వర్తిస్తున్నారు. దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ నాయకత్వాన్ని గుర్తిస్తూ ఫేమ్ ఇండియా, ఏషియా పోస్ట్ టాప్-100 మంది ఉత్తమ పోలీస్ చీఫ్ జాబితాను విడుదల చేశాయి. జాబితాలో వీవీ రాకేశ్‌రెడ్డి (ఎస్పీ గోల్పారా, అసోం), గుండాలరెడ్డి రాఘవేంద్ర(ఎస్పీ ఝౌర్సుగూడ, ఒడిశా)కు చోటుదక్కింది. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా అనుకూల పోలీసింగ్, సాంకేతికత వినియోగం తదితర అంశాల ఆధారంగా జాబితా రూపొందించారు.