కంటోన్మెంట్. అక్టోబర్ 3: తమకు సరైన వసతులు కల్పించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ సికింద్రాబాద్ పీజీ కళాశాల జ్ఞాన గంగోత్రి బాయ్స్ హాస్టల్ పీజీ సెకండియర్ విద్యార్థులు శనివారం కళాశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, సీఐ సైదులు, పోలీసులు కళాశాలకు చేరుకుని ప్రిన్సిపాల్‌తో మాట్లాడగా సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.
అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని డైనింగ్ హాల్లో విద్యార్థులు నిలబడి తింటున్నారని 250 మంది విద్యార్థులకు కేవలం ఆరు మూత్రశాలలు, మరుగొదొడ్లు ఉన్నాయని దుర్వాసన వెదజల్లుతున్నాయన్నారు.
కళాశాల ఆవరణలో పాములు, విషపురుగులు తిరుగుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యను పెంచారని కానీ వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కవితకు తొమ్మిది సార్లు వినతి పత్రం అందజేశామని, వీసీ కుమార్‌ను, చీఫ్ వార్డెన్ శ్రీనివాసులును కలిసి మొరపెట్టుకున్నా చూస్తాం చేస్తాం అంటున్నారే తప్ప కనీస వసతులు కల్పించడం లేదని వాపోయారు. ఆవరణలోని వంద భారీ వృక్షాలు నరికివేశారని తెలిపారు.