KH-RK | భారతీయ సినీ ప్రపంచంలో గర్వించదగ్గ దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ మరోసారి కలిసి తెరపై కనిపించనున్నారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ లెజెండరీ స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. తాజాగా ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ‘KHxRK’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘జైలర్’ ఫేమ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ r దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత బాధ్యతలను యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తీసుకున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తోంది.
తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో కమల్–రజనీ ఇద్దరూ స్టైలిష్ లుక్స్‌లో కనిపిస్తూ ‘నువ్వా నేనా?’ అన్నట్టుగా పోటాపోటీగా మెరిశారు. ముందుగా ఎవరి రూమ్‌లోకి వెళ్లాలన్న విషయంలో నెల్సన్ కన్ఫ్యూజ్ అవ్వడం, అనిరుధ్ టూ-ఫింగర్ టెక్నిక్‌తో ఏ రాగం కంపోజ్ చేయాలనేది సెలెక్ట్ చేసుకోవడం వంటి సన్నివేశాలు ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. కాస్ట్యూమ్స్, బూట్లు, బెల్ట్, వాచ్, కళ్లద్దాలు ఇలా ప్రతి అంశంలో ఇద్దరి డామినేషన్ స్పష్టంగా కనిపించేలా వీడియోను రూపొందించారు. ఇద్దరూ స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చి ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడే షాట్ హైలైట్‌గా నిలిచింది. రజనీ తనదైన శైలిలో కారు కీ ఇవ్వడం, దాన్ని కమల్ అందుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చివర్లో ‘ఎవరు హీరో?’ అని ఇద్దరూ అడిగే సన్నివేశం ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఇద్దరు దిగ్గజాలు గతంలో పలు చిత్రాల్లో కలిసి నటించినప్పటికీ, ఈసారి రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాటోగ్రఫీని రాజీవ్ మీనన్, ఎడిటింగ్‌ను ఆర్. నిర్మల్, ఆర్ట్ డైరెక్షన్‌ను డీఆర్కే కిరణ్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ మల్టీస్టారర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మొత్తంగా చెప్పాలంటే, KHxRK అనౌన్స్మెంట్ వీడియోతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనాలకు నాంది పలికింది. కమల్–రజనీ రీయూనియన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.