– పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
– జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో ఘటన
జూలూరుపాడు, ఫిబ్రవరి 21 : సాధారణంగా మనుషులను బురిడీ కొట్టించడానికి, డబ్బులు లాగడానికి కేటుగాళ్లు ‘హనీ ట్రాప్’ను ఆయుధంగా వాడుతుండడం తెలిసిందే. కానీ ఓ కోడిపుంజును దొంగిలించడానికి సైతం దొంగలు అదే ‘హనీ ట్రాప్’ ఫార్ములాను వాడారు. వినడానికి నవ్వు తెప్పించేలా ఉన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాకు చెందిన లకావత్ జేత్ రామ్ అనే రైతు ఇంట్లో మూడు కోడిపుంజులు, ఒక పెట్ట ఉన్నాయి. అందులో ఓ భారీ కోడిపుంజుపై కన్నేసిన దొంగలు దానిని ఎలాగైనా ఎత్తుకెళ్లాలని స్కెచ్ వేశారు. గడిచిన గురువారం మధ్యాహ్నం సమయంలో జేత్ రామ్ తన వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తన ఇంట్లో ఉండాల్సిన ఆ కోడిపుంజు కనిపించలేదు.
చుట్టుపక్కల ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. జేత్ రామ్ పొలానికి వెళ్లిన సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరు యువకులు తమ వెంట ఒక కోడిపెట్టను కూడా తీసుకొచ్చినట్లుగా, ఆ పెట్టను ఎరగా వేసి జేత్ రామ్ ఇంటి ఆవరణలో ఉన్న కోడిపుంజును దగ్గరకు ఆకర్షించారు. పెట్టను చూసి మురిసిపోయిన ఆ పుంజు దగ్గరకు రావడంతో దొంగలకు ఈజీగా చిక్కింది. వెంటనే ఆ యువకులు కోడిపుంజును పట్టుకుని బైక్ పై ఉడాయించారు.
దీంతో లబోదిబోమన్న బాధితుడు శనివారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. పెట్టను ఎరగా వేసి తన కోడిపుంజును ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకుని తనకు న్యాయం చేయాలని తన ఫిర్యాదులో కోరాడు. పుంజును దొంగిలించడానికి పెట్టను ఆయుధంగా వాడిన ఆ దొంగల చర్యను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వినూత్న చోరీకి సంబంధించిన ఫిర్యాదు కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెట్టను ఎరగా వేసి పుంజు అపహరణ