రేగొండ మార్చ్ 05 : పవిత్ర పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రావు శర్మ( Collector Rao Sharma) సందర్శించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. జయశంకర్ జిల్లారేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల తొమ్మిది నుండి 16 వరకు జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బుధవారం సందర్శించి జాతర అభివృద్ధి పనులు విషయాలను కార్యనిర్వహణ అధికారి అడిగి తెలుసుకున్నారు.
భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీవో రవి, ఆలయ చైర్మన్ భిక్షపతి, అభివృద్ధి కమిటీ సభ్యులు నాయినేని సంపత్ రావు, తదితరులు ఉన్నారు.