‘ఆ నలుగురు’ మృతి నేపథ్యంలో ఇదంతా వెనుకుండి ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోవడానికి ఖైదీలు నిల్చున్న గ్రౌండ్లోకి వేగంగా పరిగెత్తాడు ఇన్స్పెక్టర్ రుద్ర. అతన్ని అనుసరించారు జైలు డిప్యూటీ సూపరిండెంటెంట్ కరణ్, హెడ్ కానిస్టేబుల్ రామస్వామి, ఫోరెన్సిక్ ఇంచార్జీ జయ, స్నేహిల్. గ్రౌండ్లోకి చేరుకోగానే.. ‘ఇక్కడ ఉన్న ఖైదీలకు ఆ నలుగురు చనిపోయిన విషయం తెలుసా?’.. కరణ్ చెవిలో అన్నాడు రుద్ర. ‘లేదు.. సెక్యూరిటీ చెకింగ్ కోసం వేలి ముద్రలు తీసుకొంటున్నట్టు చెప్పాం’ అంటూ బదులిచ్చాడు కరణ్.
కరణ్ పర్మిషన్తో.. పక్కనున్న ఓ మైకును తీసుకొని రుద్ర ఓ అనౌన్స్మెంట్ చేశాడు. ‘చైనాకు చెందిన 14మందికి పైగా ఖైదీలు మన జైళ్లలో ఉంటే, మనవాళ్లు 173 మందికి పైగా అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారు. అంటే, చైనాకు చెందిన ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే, మనోళ్లు 12 మంది అక్కడ ఉన్నట్టు లెక్క. అయితే, గల్వాన్ ఘటన తర్వాత మనకు, చైనాకు సంబంధాలు బాగా చెడిపోయాయి. ఈ సమయంలో అక్కడ ఉన్న మనవాళ్లను కాపాడుకోవడం ఇప్పుడు మనకు చాలా ముఖ్యం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ జైలులో కూడా ఆరుగురు విదేశీ ఖైదీలు ఉన్నట్టు లెక్క తేలింది. అందులో చైనీస్ భాష వచ్చినవాళ్లు మాకు కావాలి. చైనాలో ఉన్న 173 మందిని ఇక్కడికి తీసుకురావడానికి వాళ్లు సాయం చేస్తే.. అలా సాయం చేసిన వాళ్ల శిక్షను తగ్గించే మార్గాలను మేం చూస్తాం’ అంటూ రుద్ర పూర్తి చేయకముందే.. ఆరుగురు విదేశీ ఖైదీలు లైన్లలో నుంచి పక్కకు జరిగారు. అయితే, తాము చైనాకు చెందిన వారంకాదని, తమకు చైనీస్ భాష రాదని చెప్పారు. దీంతో రుద్ర సహా టీమ్ అందరూ షాకయ్యారు. ఇంతలో లైన్లో ఎక్కడో చివరన నిల్చున్న ఓ వ్యక్తి చేయి మీదకు చూయించి తనకు చైనీస్ వచ్చని గట్టిగా అరిచాడు. సిబ్బందిని పురమాయించి అతన్ని ముందుకు తీసుకొనిరమ్మని ఆదేశించాడు కరణ్.
ఆశ్చర్యం.. తనకు చైనీస్ వచ్చు అని అరిచిన వ్యక్తి ఎవరో కాదు.. మారణహోమం జరుగబోతున్నదని రుద్రను ఇక్కడికి రప్పించిన కమలాకరే ఆ వ్యక్తి. దీంతో రుద్ర సహా అందరూ కంగుతిన్నారు. ఆవేశం పట్టలేని కరణ్.. కమలాకర్ కాలర్‌ను ముందుకు లాగి.. ‘ఏం తమాషాలు చేస్తున్నావా? నీ కంటికి మేం బఫూన్లలా కనిపిస్తున్నామా? ఘోర కలి అంటూ మమ్మల్నందరినీ టెన్షన్ పెట్టి ఇప్పుడు ఈ కొత్త డ్రామా ఏంటీ?’ అంటూ కోపంగా కొట్టబోయాడు. కరణ్‌ను నిలువరించిన రుద్ర.. ‘కరణ్ సార్.. ఆవేశం వద్దు. ‘ఆ నలుగురు’ మరణానికి కారణమైన వ్యక్తి మనకు దొరికినట్టే’ అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. ఇంతలో మధ్యలో కలుగజేసుకొన్న రామస్వామి.. ‘ఏంటి సార్.. ఈ కమలాకరే.. ఇదంతా చేశాడా?’ అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు. అసలు విషయాన్ని తర్వాత చెప్తానని రుద్ర అనడంతో.. మిగతా ఖైదీలను డిస్పర్స్ చేసి.. కమలాకర్‌ను తన క్యాబిన్లోకి తీసుకెళ్లాడు కరణ్. రుద్ర సహా మిగతావారంతా అనుసరించారు.
‘కమలాకర్.. అసలేం జరిగింది? అబద్ధాలు చెప్తే నీకే పాపం తగులుతుంది’ అంటూ కమలాకర్‌ను ప్రాధేయపడుతూ అడిగాడు రుద్ర. ‘నాకెందుకు పాపం తగులుతుంది? నేను జూనియర్ తోయిస్ట్ను. అంటే తెలుసుగా.. చైనా ప్రజలు ఆరాధ్య దైవంగా ప్రార్థించే దేవుడి అంశలో పుట్టిన వాడిని. పాప-పుణ్యాలను లెక్కగట్టిన నాకు పాపం తగలడమేంటీ?’ అంటూ కమలాకర్ అంటుండగానే అతని మాటలకు అడ్డుపడిన రుద్ర.. ‘మరి ఏ పాపం చేయకపోతే, జైలుకు ఎందుకొచ్చావ్?’ అంటూ అడిగాడు. ‘ఈ పాపులకు నా పుణ్యాలు నేరంగా కనిపించినట్టు ఉన్నాయ్’ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న కమలాకర్ చెంపను ఛెల్లుమనిపించాడు కరణ్. వెంటనే అడ్డుకొన్న రుద్ర.. ‘కరణ్ సార్.. గడిచిన అరగంట వ్యవధిలో కమలాకర్‌తో మాట్లాడిన ఖైదీని మనం వెంటనే పట్టుకోవాలి. ఇది అతని పనే. సీసీటీవీ రూమ్ ఎక్కడ?’ అంటూ రుద్ర అనగానే.. వెంటనే పసిగట్టిన కరణ్.. ‘అంటే, సెవెన్త్ సెన్స్ సినిమాలో జరిగినట్టు..’ అంటూ కరణ్ పూర్తిగా అనకముందే.. ‘యెస్’ అన్న రుద్ర.. కమలాకర్‌ను సెల్‌లోకి తరలించమని అక్కడి సిబ్బందిని పురమాయించి.. సీసీటీవీ కెమెరా రూమ్ వైపునకు పరిగెత్తాడు. రుద్రను అందరూ అనుసరిస్తూ వెళ్తుండగా.. మధ్యలో స్నేహిల్‌కు ఓ అనుమానం వచ్చింది. ‘ఒరేయ్ రుద్ర.. నువ్వు, కరణ్ సార్.. సెవెన్త్ సెన్స్ సినిమా అంటూ ఏదో అనుకొన్నారు. ఆ విషయం నాకు పూర్తిగా అర్థంకాలేదు గానీ, అందులోని విలన్..’ అంటూ స్నేహిల్ పూర్తిగా చెప్పేలోపే.. రుద్ర ఒక్కసారిగా ఆగిపోయాడు. భయంతో రుద్ర కాళ్లు వణికిపోయాయి. వెంటనే తేరుకొని.. ‘కరణ్ సార్.. మనం వెంటనే కమలాకర్‌ను బంధించాలి. అతని దగ్గరికి వెళ్దాం పదండి’ అంటూ రాకెట్ వేగంతో పరిగెత్తాడు. అయితే, అప్పటికే, జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
రుద్ర, కరణ్, రామస్వామి, జయ, స్నేహిల్ ఇలా అందరూ కమలాకర్ సెల్ ఉన్న వరండాకు చేరుకొనేలోపే.. రక్తపు మడుగులో పడి నలుగురు వార్డర్లు చనిపోయి ఉన్నారు. అసలేం జరిగిందో తెలియక.. కమలాకర్ భయంతో వణికిపోతున్నాడు. ‘సెవెన్త్ సెన్స్ సినిమాను గుర్తు చేసుకొన్నాం గానీ, అందులో జరిగే ఘోర కలిని పసిగట్టలేకపోయాం’ అంటూ రుద్ర, కరణ్ బాధపడ్డారు. అసలు సెవెన్త్ సెన్స్ సినిమాకు.. కమలాకర్ చైనా దేవుడిని అని అనడానికి, వార్డర్లు చనిపోవడానికి సంబంధం ఏంటో మీరు కనిపెట్టారా?
భారత్‌పై బయోలాజికల్ యుద్ధాన్ని చేయడానికి చైనా నుంచి ఓ విలన్ వస్తాడు. కండ్లతోనే మనుషులను వశీకరణ చేసి.. ఒకరినొకర్ని చంపుకొనేలా ఆ విలన్ చేస్తాడు. ఇదే సెవెన్త్ సెన్స్లోని కీలక ఘట్టం. ఆ సినిమా లాగానే కమలాకర్‌కు ఎవరో కండ్లతో వశీకరణ చేశారు. అందుకే.. మొదటిసారి రుద్రను కలిసినప్పుడు తాను ఎన్నో పాపాలు చేసినట్టు బాధపడ్డ కమలాకర్.. ఇప్పుడేమో తనకు తాను ధైవంగా చెప్పుకొన్నాడు. దీంతో కమలాకర్ బాడీ, మైండ్ లాంగ్వేజీలో ఛేంజ్‌ను కనిపెట్టిన రుద్ర.. అతన్ని హిప్నొటైజ్ చేసినట్టు కనిపెట్టాడు. అయితే, ఆ వశీకరణ స్థాయి ఎంతలా ఉందో గుర్తించలేకపోయాడు. ఫలితం.. నలుగురు వార్డర్లు మరణించారు.