చిట్యాల, మార్చి 13 : రాష్ట్ర బడ్జెట్లో(Budget )విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని చిట్యాల మండలం ఏబీవీపీ శాఖ అధ్యక్షుడు బుర్ర అభిజ్ఞ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం తాసిల్దార్ హేమాకు వినతిపత్రం అందజేశారు. ఈ ఏబీవీపీ నాయకుడు వెలుపుల రాజకుమార్ మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న ఫీ రీయింబర్మెంట్స్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని భర్తీ చేయాలని, విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలన ప్రభుత్వాన్ని కోరారు. టీఏఎఫ్ఆర్సీ ఫీజుల పెంపు ప్రతిపాదనలను వెంటనే వెనక్కి తీసుకోవాలిని డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని, అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తున్నదని విమర్శించారు.
గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7% నిధులే కేటాయించి, వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదని ఆరోపించారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12-13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం లో 90% మంది విద్యార్థులు BC, SC, ST బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులేనని, వారందరూ కూడా స్కాలర్షిప్స్ మీద ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారన్నారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమిస్తామని హెచ్చరించారు.