అన్నదాతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు ‘చెప్పేది కొండంత.. చేసేది పిసరంత’ అన్న చందంగా మారింది. చివరి ధాన్యపు గింజ వరకు కొంటామని ఆర్భాటంగా ప్రచారాలే తప్ప.. ఆచరణలో కనిపించడం లేదు. వరికోతలు పూర్తయి దాదాపు నెల రోజులు కావొస్తున్నా ఇప్పటివరకు సగం ధాన్యం కూడా కొనలేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు అరిగోస పడుతున్నారు. ధాన్యపు రాశులతో కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. వర్ష భయంతో వణికిపోతున్నా కనుకరించే నాథుడే కరువయ్యారని ఆవేదన చెందుతున్నారు.
-మహబూబాబాద్/ జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ఇప్పటి వరకు కనీసం సగం ధాన్యం కూడా కొనలేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. వాతావరణం చల్లబడడంతో మాయిశ్చర్ రాక అరిగోస పడుతున్నారు. ఓ పక్క మాయిశ్చర్ రాక.., మరోపక్క అకాల వర్షాలు ఆగం చేస్తున్నాయి. కేంద్రాల్లో అధికారులు ఇప్పటి వరకు 41.75 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 1.59 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనాల్సి ఉన్నది. కొనుగోళ్లు లక్ష్యం చేరకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది.
కేంద్రాల్లోనే ధాన్యం రాశులుండగా, మరోవైపు రైతులు యాసంగి వరినాట్లు ప్రారంభించారు. చాలా వరకు రైతులు ధాన్యంలో తేమశాతం రాక, సకాలంలో ధాన్యం డబ్బులు అందక, వర్షాల భయంతో ప్రైవేటుగా మిల్లులకు అమ్ముకుంటున్నారు. అలాగే కేంద్రాల్లో బస్తా ధాన్యం నుంచి 4 కిలోలు కోత విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎక్కడా ప్యాడీ క్లీనర్‌ను ఉపయోగించడం లేదని, క్లీనర్లు పేరుకే అక్కడ ఉంచుతున్నారని తెలుపుతున్నారు.
జిల్లాలో 203 ధాన్యం కొనుగోలు కేంద్రాలుండగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 41.75 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 1.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. 7574 మంది రైతుల నుండి రూ. 96.87కోట్ల విలువైన్ ధాన్యాన్ని సేకరించి రైతుల ఖాతాల్లో రూ. 56.24 కోట్లు జమ చేశారు.
అలాగే 35825 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. అలాగే సీఎంఆర్ పెండింగ్‌లో ఉన్న మూడు రైస్ మిల్లులను అధికారులు డిఫాల్ట్లో పెట్టారు. జిల్లాలోని రేగొండ మండలం భాగిర్థిపేటకు చెందిన దుర్గాభవాని, చిట్యాల మండలం ఒడితెల గ్రామానికి చెందిన మేఘన, రేగొండ మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస రైస్ మిల్లులను అధికారులు డిఫాల్ట్లో పెట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ములుగు రూరల్, డిసెంబర్ 24 : అకాల వర్షంతో అన్నదాతలకు ఆగం చేస్తున్నది. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని ములుగు, మహబూబాబాద్, హనుమకొండలోని పలు ప్రాంతాల్లో వాన కురవడంతో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానాపాట్లు పడాల్సి వచ్చింది. ఇప్పటికే కొద్దిరోజులు వాతావరణం చల్లబడడం, ఉదయం నుంచి మబ్బులు కుమ్ముకోవడంతో రై తులకు దిగులు పట్టుకోగా రాత్రివేళ మొదలైన వానతో ఇంకా దిగులు చెందారు. ములుగులో వ్యవసాయ కమిటీ ఆధ్వర్యంలో టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడ్డ రైతులు చేసేదేమీలేక పరదాలను కిరాయికి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు టార్పాలిన్లు, గన్నీ బ్యాగులను అందించి సకాలంలో ధాన్యం మిల్లులకు తరలించాలని కోరుతున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో వరి కోతలు పూర్తయి నెల రోజులు దాటినా ఇంకా ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. వడ్ల కొనుగోళ్ల విషయంలో అధికారులు చేతులెత్తేశారు. ఇప్పటివరకు 50 శాతం నుంచి 60 శాతం వరకు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. ఇంకా 40శాతం కొనాల్సి ఉన్నది. రెండు రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టడం ఎందుకు పెట్టడం లేదని పలువురు రైతులు నిర్వాహకులను ప్రశ్నిస్తే జిల్లాలో ఉన్న మిల్లులో ఖాళీగా స్థలం లేదు.. నిండిపోయాయి.. వేరే జిల్లా అలాట్ చేస్తే అప్పుడు ధాన్యం రవాణా చేస్తామని చెబుతున్నారు. ఒకవైపు తుఫాను ప్రభావంతో వాతావరణంలో ఒకసారిగా మార్పులు వచ్చాయి. మబ్బులతో అకడకడ చిరుజల్లులు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల్లో ఉన్న ధా న్యం తడిస్తే మా పరిస్థితేంటని వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యానికి కాం టాలు పెట్టండి.. మేము వెళ్లిపోతామని చెప్పినా నిర్వాహకులు రైతుల మాట వినడం లేదు. ఇప్పటికే కాంటా అయిన ధాన్యం కేంద్రాల్లో నెట్టుకొట్టి అలాగే ఉన్నాయి. కొత్తగా కొనాల్సిన ధాన్యానికి కాంటాలు పెట్టడం లేదు. దీంతో రైతులు అష్టకష్టాలు తప్పడం లేదు. కొంతమంది రైతులు విధిలేని పరిస్థితిలో ప్రైవేట్ వ్యాపారులకు ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మొద్దు నిద్రను వీడి కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.