బచ్చన్నపేట, మే 10 : కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో పేర్ని గౌతమ్ (19) అనే యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని పోచన్నపేట వైపు రహదారిలో శనివారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచన్నపేట గ్రామానికి చెందిన వారి వివాహం లిమ్రా గార్డెన్ లో జరిగింది. ఈ వివాహానికి హైదరాబాద్ నుండి అద్దెకు షిఫ్ట్ కారు తీసుకుని గౌతమ్, శ్రీకాంత్, అఖిల్ హాజరయ్యారు.
లిమ్రా గార్డెన్ నుండి బచ్చన్నపేట సెంటర్‌కు వచ్చి తిరిగి గార్డెన్‌కు వెళ్తున్న క్రమంలో కారు అదుపుతప్పి కల్వర్టు కింద ఉన్న రాయిని ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులోని గౌతమ్, అఖిల్ తీవ్రంగా గాయపడగా శ్రీకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో ముగ్గురిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో గౌతమ్ మృతి చెందాడు. అఖిల్, శ్రీకాంత్‌ను హైదరాబాద్‌లోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు ఉమ – దేవేందర్ తమ కుమారుడి మృతికి కారు డ్రైవర్ అజాగ్రత్తనే కారణమని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఎస్కే అమీద్, ట్రైనింగ్ ఎస్ఐ గోవర్ధన్ కేసు దర్యాప్తు చేపట్టారు.