యాసంగిలో పండిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ నిర్ణయించడం గొప్ప విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కనీస మద్దతు ధరతో చివరి గింజ వరకూ కొంటామని, రైతులకు ఇబ్బంది కలుగనీయమని ఆయన పేర్కొన్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడ్ల కొనుగోళ్లపై ప్రజాప్రతినిధులు, అధికారులు, రైస్ మిల్లర్లతో కలిసి హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా వడ్లు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి రైతు పక్షపాతిగా మారారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షులు మారెపల్లి సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కలెక్టర్లు రాజీవ్‌గాంధీహన్మంతు, బీ గోపి పాల్గొన్నారు.
వరంగల్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ అన్నదాతల పెన్నిధి అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి రైతులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుంటే… సీఎం కేసీఆర్ మొత్తం పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించడం గొప్ప విషయమని చెప్పారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడ్ల కొనుగోళ్లపై ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లతో హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. క్లిష్ట సమయంలో సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా నిలిచారని మంత్రి అన్నారు. వడ్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో ప్రతి రైతు సంతోషంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల కారణంగా… తెలంగాణలో వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే రూ. 3 వేల కోట్లు నష్టం వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఎంత నష్టం వచ్చినా రైతులకు అండగా నిలవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. ప్రతి ఎకరాకు నీరు, 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతుబీమా, అందుబాటులో విత్తనాలు, ఎరువులు… నకిలీ ఉత్పత్తుల నియంత్రణ వంటి చర్యలతో వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, వరి సాగులో మొదటి స్థానంలో ఉన్నదని, దీన్ని చూసి కేంద్రం ఓర్వలేక వడ్ల కొనుగోలుపై ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ధాన్యం క్వింటాలుకు రూ.1960 ధర వచ్చేలా చూడాలని అన్నారు. వడ్ల కొనుగోలు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
వడ్ల కొనుగోలులో రైస్ మిల్లర్లు, రైతులను ఎలాంటి ఇబ్బందులూ పెట్టొదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లుకు రైతులు సొంత ట్రాక్టర్లతో తెచ్చిన వడ్లను త్వరగా అన్లోడ్ చేయించాలన్నారు. వడ్లను కొనుగోలు చేసిన తర్వాత రైతులు వాటిని మిల్లుల వద్దకు తెచ్చే ప్రక్రియ వీలైనంత వేగంగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శాఖల మధ్య సమన్వయంతో కలిసి పని చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. రవాణా ఏర్పాట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ వీలైనంత త్వరగా, వేగంగా పూర్తయ్యేలా చూడాలని భూపాలపల్లి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. జిల్లా పరిషత్ చైర్మన్లు ఎం సుధీర్ కుమార్, గండ్ర జ్యోతి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు పలు సూచనలు చేశారు. హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, వరంగల్ కలెక్టర్ గోపి… రెండు జిల్లాల అడిషనల్ కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
