నర్సంపేట, ఫిబ్రవరి 12: ఇటీవల డివిజన్లో వడగండ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సర్వే చేసి నివేదికలను గ్రామ పంచాయతీల వద్ద ప్రదర్శించినట్లు చెప్పారు. రైతుల నుంచి అభ్యంతరాలను అధికారులు స్వీకరించి తప్పిదాలను సరి చేస్తారన్నారు.
రీ షెడ్యూల్ అంశాలను సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగే బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు. కమర్షియల్ బ్యాంకులే కాకుండా డీసీసీబీ ఇచ్చిన రుణాలను కూడా రీ షెడ్యూల్ చేసి, పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేసేలా ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 13,050 ఎకరాల్లో మిర్చి, 13,164 ఎకరాల్లో మక్కజొన్న, 114 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం జరిగిందన్నారు. మొత్తం 18 వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 33 శాతం కంటే ఎక్కువగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు.
డయాగ్నస్టిక్ హబ్‌గా తెలంగాణ
డయాగ్నస్టిక్ హబ్‌గా తెలంగాణను మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, నర్సంపేటలో టీ డయాగ్నస్టిక్ సెంటర్‌ను మంజూరు చేయించామని ఎమ్మెల్యే పెద్ది వివరించారు. ఇందులో రోగులకు 57 రకాల పరీక్షలు చేస్తారన్నారు. దీనివల్ల పేదలకు బయట టెస్టులు చేయించుకునే బాధ తప్పుతుందన్నారు. ఇందుకోసం నర్సంపేట వైద్యశాల ఎదురుగా ఉన్న స్థలంలో భవన నిర్మాణానికి రూ. 1.25 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఆరు నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుందని వివరించారు. నర్సంపేటలో జిల్లాస్థాయి వైద్యశాల 250 పడకలతో మంజూరైందన్నారు. భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ముగిసిందన్నారు. ఈ దవాఖానలో రూ. 4 కోట విలువైన పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఇప్పటికే నర్సంపేట డివిజన్లో 25 హెల్త్ సబ్‌సెంటర్లు మంజూరైనట్లు వెల్లడించారు. మరో 13 సబ్ సెంటర్లు మంజూరైతే వందశాతం పూర్తి చేసినట్లు అవుతుందని తెలిపారు. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా దవాఖానకు శంకుస్థాపన చేయిస్తామన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, సొసైటీ చైర్మన్ మూరాల మోహన్‌రెడ్డి, పార్టీ నెక్కొండ మండల అధ్యక్షుడు సూరయ్య, కౌన్సిలర్లు రాంబాబు, దార్ల రమాదేవి, గోల్య, పుల్లూరి స్వామి, వేణుగోపాల్‌రెడ్డి, సతీశ్, రాయరాకుల సారంగం, వెంకటేశ్వర్లు, మండల శ్రీనివాస్, యాదగిరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం క్యాంప్ ఆఫీసులో టీఆర్ఎస్ పట్టణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పెద్దిని మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్దిని కలిసిన వారిలో పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వేణుగోపాల్‌రెడ్డి, రావుల సతీశ్, పీ స్వామి, సారంగం, వెంకటేశ్వర్లు, మండల శ్రీనివాస్, యాదగిరి ఉన్నారు.
గోదాముల నిర్మాణ పనుల పరిశీలన
నెక్కొండ/నర్సంపేటరూరల్: నెక్కొండ మండలం పెద్దకోర్పోలులో నిర్మిస్తున్న పది వేల మెట్రిక్ టన్నుల గోదాముల పనులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. పురోగతిని క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, సర్పంచ్ మహబూబ్‌పాషా, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్ము రమేశ్‌యాదవ్, నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, మాదాసు రవి, కర్పూరపు శ్రీనివాస్, సారంగం పాల్గొన్నారు. అనంతరం పెద్ది రెడ్లవాడ పీఏసీఎస్ చైర్మన్ జలగం సంపత్‌రావు నాయనమ్మ నర్సమ్మ మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
అలాగే, పత్తిపాక శివారు లావుడ్యాతండాకు చెందిన కల్పనా తేజానాయక్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కస్నాతండా సర్పంచ్ బానోత్ రవినాయక్ సోదరుడు పవన్‌కల్యాణ్ వివాహానికి హాజరయ్యారు. అంతేకాకుండా నర్సంపేట మండలంలోని జీజీఆర్పల్లిలో సర్పంచ్ తుత్తూరు కోమల-రమేశ్ దంపతుల కూతురు సారీ ఫంక్షన్‌కు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
అదేవిధంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, గురిజాల ఎంపీటీసీ బండారు శ్రీలత, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, నాయకులు బండారి రమేష్, మోతె పద్మనాభరెడ్డి, మోటూరి రవి, అల్లి రవి, పత్రి కుమారస్వామి, నర్సింగం, ప్రకాశ్, గొడిశాల సంపత్, మాటూరి రవీంద్రాచారి, ఎడ రమేశ్, మంచిక దేవేందర్, రాజు, ప్రభాకర్, కృష్ణ, పైడి, ముదురు రమేశ్, మధు హాజరయ్యారు.