చెన్నారావుపేట, ఫిబ్రవరి 12: ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలని జిల్లా పరీక్షల నియంత్రణ అధికారి సృజన్తేజ అన్నారు. శనివారం ఆయన మండలంలోని ఉప్పరపల్లి జడ్పీఎస్ఎస్, అక్కల్చెడ ఎంపీపీఎస్, జీడిగడ్డతండా ఎంపీపీఎస్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల కోసం విద్యాజ్యోతి ‘వరంగల్ యూట్యూబ్’ చానల్లో ప్రతి రోజు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలపై ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రార్థనా సమయానికి ముందు, సాయంత్రం పూట తప్పనిసరిగా ప్రత్యేక తరగతులు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదుగురికి 10/10 జీపీఏ వచ్చేలా విద్యార్థులను సిద్ధం చేయాలని హెచ్ఎంలకు సూచించారు. వందరోజుల రీడింగ్ కార్యక్రమం షెడ్యూల్ ప్రతి పాఠశాలలో ఉంచాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు ఫ్లోరెన్స్, హరి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.