నర్సంపేటరూరల్, ఏప్రిల్ 10: కేసీఆర్ రాష్ర్టానికి ముఖ్యమంత్రే కాకుండా ప్రజా నాయకుడని, తెలంగాణలోని గ్రామాలు, మారుమూల తండాలు, పల్లెల్లో సైతం మౌలిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయంగా పని చేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రూ. 1.50 కోట్ల నిధులతో నర్సంపేట మండలానికి మంజూరైన సీసీ, బీటీరోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ది మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపట్టామని తెలిపారు.
గ్రామ అభివృద్ధి ప్రజల చేతుల్లోనే ఉంటుందని గుర్తుచేశారు. కమ్మపల్లి నుంచి వరంగల్, ఇతర మార్కెట్లకు వెళ్లాలంటే తిమ్మంపేట క్రాస్‌రోడ్డు వరకు బీటీరోడ్డు కావాలని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇరు గ్రామాల ప్రజలు కోరారన్నారు. వారి కోరిక మేరకు రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. దాసరిపల్లి, కమ్మపల్లి గ్రామాల్లో ఇంకా అభివృద్ధి జరుగాల్సి ఉందని, దానిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పలానా పార్టీ నాయకుడి ద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుందని భావిస్తే అతడిని ఎన్నుకుంటేనే ఆ గ్రామ బాగుపడుతుందని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని శక్తివంచన లేకుండా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలోని రైతులను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ దేనికైనా సిద్ధమని చెప్పారని పెద్ది అన్నారు. ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించి అసెంబ్లీలో రైతులను ఆదుకుంటామని చెప్పారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రహదారులు అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు.
బీటీరోడ్డు నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని, వర్షాకాలంలోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. 57 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ మే నెల నుంచి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. కాగా, దాసరిపల్లిలో రూ. 60లక్షల నిధులతో చంద్రయ్యపల్లి క్రాస్‌రోడ్ నుంచి దాసరిపల్లి వరకు 1.2 కిలో మీటర్లు, కమ్మపల్లిలో రూ. 90 లక్షల నిధులతో కమ్మపల్లి ప్రధానరోడ్డు నుంచి దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామం వరకు 1.7 కిలో మీటర్ల వరకు బీటీరోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా కమ్మపల్లి ఎస్సీకాలనీలో రూ. 10 లక్షలతో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, కమ్మపల్లిలో పల్లెప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మొక్కల ఎదుగుదలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పెద్దిని ప్రజాప్రతినిధులు, నాయకులు సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి, దాసరిపల్లి, కమ్మపల్లి, భోజ్యానాయక్‌తండా, చంద్రయ్యపల్లి, రాజేశ్వర్రావుపల్లి సర్పంచ్‌లు పెండ్యాల శ్రీనివాస్, వల్గుబెల్లి రంగారెడ్డి, భూక్యా లలిత, బరిగెల లావణ్య, బొజ్జ యువరాజ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఎంపీటీసీలు వల్గుబెల్లి విజయ, భూక్యా వీరన్న, పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వల్లాల కరుణాకర్‌గౌడ్, భూక్యా వీరన్ననాయక్, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, కడారి కుమారస్వామి, దాసరి బుచ్చిరెడ్డి, రాజిరెడ్డి, నర్సింహారెడ్డి, సంకటి గణపతిరెడ్డి, తోటకూరి వెంకటేశ్, ఐలోని, సాంబరెడ్డి, కట్ల సుదర్శన్‌రెడ్డి, పెద్ది తిరుపతిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, గంధం జగన్మోహన్రావు పాల్గొన్నారు.
నర్సంపేట: రాష్ట్ర ఏర్పాటుతోనే ఉద్యోగాల కల్పన ఫలించిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,147 ఉద్యోగాల భర్తీకి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారని గుర్తుచేశారు. అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నర్సంపేటలో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యువత విద్యార్హతను బట్టి ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తామని చెప్పారు. పేద, దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ ద్వారా శిక్షణ పొందవచ్చని సూచించారు. ఆసక్తిగల విద్యార్థులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9381333314 నంబర్లో సంప్రదించాలని కోరారు.