రాయపర్తి, ఏప్రిల్ 15 : రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడితో రాష్ట్రంలోని సర్కారు పాఠశాలలకు మహర్దశ పట్టనుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కొండూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.32.60లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ కర్ర సరితారవీందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఉండటంతో తెలంగాణలో పేదవారికి విద్య అందని ద్రాక్షగానే మారిందని, దీంతో ఇక్కడి యువత బతుకుదెరువు కోసం చదువులు పక్కనబెట్టి పట్నాలకు వలసలు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి ప్రభుత్వాలు ఈ ప్రాంతంలోని సర్కారు పాఠశాలలు, వైద్యశాలలను అభివృద్ధి చేయలేదన్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక కార్పొరేట్ విద్యాలయాలు ఇక్కడికి వచ్చాయని, వాటికి అప్పటి ప్రభుత్వ అండదండలు ఉండడంతో తెలంగాణలో విద్యా వ్యాపారం మొదలైందని వివరించారు. ఈ క్రమంలో తెలంగాణలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ విద్యాలయాల్లో చదివించేందుకు పుస్తెమట్టెలు అమ్ముకుని అప్పుల పాలయ్యేవారని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడగానే పేదవారికి నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రకానికి అంకురార్పణ చేసినట్లు వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన విద్యార్థులు శ్రావణి, లావణ్య, చరణ్‌తో పాఠశాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై మాట్లాడించారు. పాఠశాల అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్‌లో సర్కారు పాఠశాలల్లో సీట్ల కోసం ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పైరవీలు చేసే పరిస్థితులు రావాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని, ఆయన పనితీరుకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతుబంధు, రైతుబీమా, వ్యవసా యానికి 24గంటల ఉచిత విద్యుత్ పథకాలే నిదర్శనమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, బానోత్ హరిసింగ్, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్‌రావు, మండల ప్రత్యేకాధికారి నరేశ్‌కుమార్‌నాయుడు, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, ఎంపీటీసీ చిర్ర ఉపేంద్రావెంకన్న, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, ఏవో గుమ్మడి వీరభద్రం, విద్యాశాఖ జిల్లా నోడల్ ఆఫీసర్ గారె కృష్ణమూర్తి, ఎంఈవో నోముల రంగయ్య, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ అధికారి నరేందర్‌రెడ్డి, రామాశెట్టి రవీందర్, పీఏసీఎస్‌ల చైర్మన్లు జక్కుల వెంకట్‌రెడ్డి, కుందూరు రాంచంద్రారెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్లు మండల సంతోష్‌కుమార్, కర్ర ప్రవీణ్‌రెడ్డి, కుందూరు రత్నాకర్‌రెడ్డి, పూస మధు, దేశబోయిన ఉపేందర్, గుండె బాబు, పోల్నేని శ్యాంరావు, వీరమనేని సత్యనారాయణరావు, పులి సోమయ్యగౌడ్, ఆవుల కేశవరెడ్డి, నేరెల్లి రాములు, మహేశ్, రామస్వామి, గుగులోత్ సోమన్న తదితరులు పాల్గొన్నారు.