వల్మీడి (పాలకుర్తి) : వల్మీడిలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆగమ శాస్త్రాల ప్రకారమే విగ్రహాల పున: ప్రతిష్ఠాపన వైభవంగా జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli ) అన్నారు. అందులో ఎలాంటి పొరపాట్లు లేవని స్పష్టం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలోని రాములవారి గుట్టమీద ఆదివారం ధ్వజ స్తంభ ప్రతిష్టాపనలో మంత్రి దంపతులు పాల్గొని పూజలు చేశారు .
ఆయన మాట్లాడుతూ .. కొంత మంది గుడులు, గోపురాలపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవుడి మీద రాజకీయం ( Politics ) చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ (CM KCR ) సహకారంతో పురాణ ఆలయాలను తానే అభివృద్ధి చేస్తున్నానని వెల్లడించారు. . పురాతన ఆలయాన్ని సీఎం సహకారంతో రూ. 20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. రాజకీయ నాయకులు దేవాలయాలను అభివృద్ధి విషయమే మాట్లాడాలని తమ స్వార్థం కోసం రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు.
అవమానించడం తగదు ..
రాష్ట్ర అర్చక ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ దేవగిరి రమేశ్ శర్మ మాట్లాడుతూ రాజకీయం ఎక్కడైనా చేసుకోండి. దేవాలయాలు. అర్చకులు, పూజారులు, వేద పండితుల మీద చేయడం, వారిని అవమానించడం తగదని అన్నా. తమపై రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వల్మీడిలో నూతనంగా నిర్మించనున్న పెద్దమ్మతల్లి దేవాలయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, వల్మీడి దేవస్థాన చైర్మన్ జై హింద్, తదితరులు పాల్గొన్నారు.