హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 31: ఆంగ్ల భాషపై(English language )పట్టు ఉద్యోగినికి తొలి మెట్టు అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అన్నారు. విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగ సెమినార్ హాల్లో నిర్వహించిన విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ 54వ బ్యాచ్ 40 రోజుల ‘కమ్యూనికేషన్ స్కిల్స్అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్’ తరగతుల ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆంగ్ల భాషపై పట్టు అవకాశాల వారధిగా ఉందని, ప్రపంచంలో ఎక్కడైనా బతకవచ్చన్నారు. సాధన ద్వారా ఏదైనా సాధ్యమేనని విశ్వవిద్యాలయ విద్యార్థులు అవకాశాలను వదులుకోవద్దన్నారు. దూరవిద్య కేంద్రం సంచాలకులు, ఆర్ట్స్ విభాగాల ఇంచార్జ్ డీన్ బి.సురేష్ లాల్ మాట్లాడుతూ నామమాత్రపు నమోదు రుసుంతో ప్రతిరోజు సాయంత్రం 40 రోజుల పాటు నిర్వహించే తరగతులు విద్యార్థులు వినియోగించుకొని అబివృద్ధి చెందాలన్నారు. 21వ శతాబ్ద్ధపు నైపుణ్యాలు సాఫ్ట్ స్కిల్స్అని, నైపుణ్యాలు కలిగి ఉండటం గ్రామీణ, పట్టణ అనే తేడా లేదన్నారు.