లింగాల ఘనపురం : స్టేషన్ ఘన్పూర్ నియోజవర్గంలో ఒక్క ఎకరా వరి పంటను ఎండనివ్వమని, తాగునీటికి ఎద్దడి లేకుండా చూస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలో జరుగుతున్న అశ్వరాయపల్లి కుడి కాలువ 15. 16. 17. 18. 19. 20 కాలువ పనులను సోమవారం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు అందించి ప్రోత్సహిస్తామన్నారు.
అధికారులు ఆ కోణంలో శ్రమించి రైతులకు సాగునీరు, గ్రామ ప్రజలకు తాగునీటిని అందించాలన్నారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని తాగునీటికి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.