బచ్చన్నపేట. ఏప్రిల్ 05 : బచ్చన్నపేట మండలంలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బోట్ల శేఖర్ అన్నారు. కేవీపీఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దళితులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాలలో దళితులకు రేషన్ కార్డులు,ఇండ్లు, వితంతు, వృద్ధాప్య పెన్షన్లు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దళితులను చిన్న చూపు చూస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులందరికి న్యాయం చేస్తానని చెప్పి ఏమి చేయలేదని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలను కూడా ఇప్పటివరకు ఏ ఒక్క హామీ అమలు చెయ్యలేదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దళితులు, అలాగే ప్రజలకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలిగా కళ్లెం శైలజ, అధ్యక్షుడిగా తుడుం మధు, కార్యదర్శిగా గంధమాల మనోహర్, ఉపాధ్యక్షులుగా కొమ్ము శిరీష,బొట్టు కరుణాకర్, సహాయ కార్యదర్శి పికిలి భాగ్య శ్రీపతి నరేష్, కమిటీ సభ్యులుగా కర్రే రాములు, కమ్మడి మహేష్, జేరిపోతుల జగన్, మానేపల్లి శ్రీకాంత్, కర్ర ఉదయ్ని ఎన్నుకున్నారు.