గీసుగొండ, మే 5: మండలంలోని శాయంపేటలో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో 22 కంపెనీలు ఎంవోయూ చేసుకున్నట్లు టీఎస్ఐఐసీ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఆలస్యమైనా ఇప్పుడు వేగంగా పనులు సాగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభమయ్యే పరిశ్రమలకు ప్రభుత్వం 545 ఎకరాల భూమిని కేటాయించింది. వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో లక్ష మందికి నేరుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రతిపాదనలు చేసుకున్నాయి.
కైటెక్స్ వస్త్రపరిశ్రమ సుమారు 800 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు గత ఏడాది దరఖాస్తులు స్వీకరించింది. మరో ఆరు నెలల్లో మరికొన్ని కంపెనీలు రానున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండేళ్లలో పార్కులో అనేక పరిశ్రమలు వచ్చి చేరుతాయని చెబుతున్నారు. గత ఏడాదిలో గణేశా ఇకోపెట్ టెక్ పరిశ్రమల నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేసుకుంది. కేరళ రాష్ర్టానికి చెందిన కైటెక్స్, ఉత్తర కొరియాకు చెందిన యంగ్వన్ పరిశ్రమలు, చేనేత కార్మికులు కలిసి ఏర్పాటు చేసుకుంటున్న పరిశ్రమలకు ఈ నెల 7న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనుండగా, ఆయా కంపెనీల ప్రతినిధులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గణేశా ఇకోపెట్ పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం రూ. 300 కోట్లతో పార్కులో మౌలిక వసతులు కల్పించింది. కొన్ని బీటీ రోడ్లు పూర్తి కాకపోవడంతో అధికారులు డ్రైనేజీ పనులు చేస్తున్నారు. పార్కులో హెలీప్యాడ్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.