జనగామ చౌరస్తా, మార్చి 17 : ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీరు అందక జిల్లాలో పంటలు ఎండిపోయిన రైతులకు స్టేషన్ ఘన్పూర్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు ఎండి, పశువులకు మేతగా మారిన పొలాల బాధిత రైతుల గురించి తన ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరం అన్నారు. రైతుల గోడు పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులను ఉద్దరిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆ రైతులను మోసం చేసిందన్నారు.
ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద వడ్డీకి పెట్టుబడిగా అప్పులు తెచ్చి రైతులు వరి, మొక్కజొన్న పంటలు వేశారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేసిన ఆ పంటలు సాగునీరు అందక ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు చూపుతో జిల్లాలోని దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లోకి సాగునీరు నింపి ఉంటే రైతులకు ఈ కష్టం, నష్టం వచ్చేది కాదన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. లేకుంటే రైతులందరితో కలిసి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇర్రి అహల్య, రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేశ్, రాపర్తి సోమయ్య, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాశ్, పోత్కనూరి ఉపేందర్, బెల్లంకొండ వెంకటేశ్, మునిగల రమేశ్, చిట్యాల సోమన్న, కోడెపాక యాకయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.