సమైక్యపాలనలో కరంట్ కోతలతో కుదేలైన వ్యాపారం.. కేసీఆర్ సర్కారు తెచ్చిన ‘ఫుల్ పవర్’తో జోరుగా సాగుతోంది. అప్రకటిత కోతలు, అంతరాయాలతో చిరు వ్యాపారాలే గాక వాణిజ్య దుకాణాలు, అత్యవసర సేవలందించే హాస్పిటళ్లపై తీవ్రం ప్రభావం చూపగా నేడు నిరంతర విద్యుత్‌తో గిరాకీలు పెరుగడంతో పాటు మెరుగైన వైద్యమూ అందుతోంది. ఫలితంగా చిన్న, మధ్యతరగతి వర్గాల వ్యాపారం పుంజుకోగా, తీరిక లేని పనితో వారిలో కొండంత ధైర్యం నింపుతోంది. అంతేగాక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్‌లు, హాస్పిటల్స్‌లో జనరేటర్ల వినియోగం తగ్గి యాజమాన్యాలకు నిర్వహణ భారం భారీ స్థాయిలో తగ్గింది. ఇలా నాటి ప్రభుత్వాల అసమర్థత వల్ల నష్టపోయిన ఆయావర్గాల జీవితాల్లో నేడు 24గంటల విద్యుత్ ‘నిరంతర వెలుగులు’ నింపుతోంది.
జనగామ చౌరస్తా, మే 4 : కరంట్ ఉంటెనే షాపింగ్ మాల్లో గిరాకీ ఉంటుంది. కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు వ్యాపారులం ఎవరమైనా షాపింగ్ మాల్స్‌లో ప్రత్యేకంగా లైటింగ్ డిజైన్ ఏర్పాటు చేస్తాం. వాటిని చూసి కస్టమర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. విద్యుత్ వెలుగుల మధ్య కస్టమర్లు కొనుగోలు చేసే వస్ర్తాలు మరింత కాంతివంతంగా కనిపిస్తాయి. వస్త్ర వ్యాపారంలో కరంటే మాకు ప్రధానం. కరంట్ లేకుంటే వ్యాపారం నడువది. ఎనిమిది ఏండ్ల క్రితం వరకు కరంట్ సమస్య తీవ్రంగా ఉండేది. దానితో గిరాకీ అంతంత మాత్రంగా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత కరంట్ సమస్య లేదు. మాకు గిరాకీ బాగనే అయితాంది.
– బోగ భాస్కర్, విజయ షాపింగ్ మాల్ ప్రొప్రైటర్, జనగామ
పోచమ్మమైదాన్ : తెలంగాణ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తుండడంతో ప్రజలకు అంతరాయం లేకుండా వైద్య సేవలు అందిస్తున్నాం. నర్సింగ్ హోమ్‌లపై అదనపు భారం కూడా తగ్గింది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్ల ప్రకారం జనరేటర్ మెయింటన్ చేసే స్థితిలో లేం. నిరంతర కరంట్ సరఫరా చేయడం వల్ల సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు శస్త్ర చికిత్సలు సాఫీగా చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వ ముందుచూపు, ప్రజాహిత పాలనతో చాలా కాలం నుంచి జనరేటర్, ఇన్వర్టర్ ఉపయోగించడం లేదు. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చాలు, కరంట్ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. ఇప్పుడు తెలంగాణ సర్కారు వల్ల మాకు కరంటు భయం లేకుండా పోయింది.
– డాక్టర్ జీ అటల్, వెంకటేశ్వర నర్సింగ్ హోమ్, వరంగల్
మహబూబాబాద్, మే 4 : తెలంగాణ రాకముందు కరంట్ పెద్ద సమస్య. ముఖ్యంగా మా మెకానిక్‌లు చాలా ఇబ్బందిపడేది. ఒక టీవీ రిపేరు చేయడానికి అరగంట పడ్తది. కానీ గిరాకీ వచ్చిన టైమ్‌కు కరంట్ ఉండకపోయేది. దీని వల్ల నిమిషాలల్ల అయ్యే పనికి రోజులు పట్టేది. పాపం కస్టమర్లు తిరిగిపోయేవాళ్లు. గిరాకీ కూడా తక్కువ అయ్యేది. ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు గిరాకీ వచ్చుడే ఆలస్యం.. నిమిషాల్లో చేసి ఇస్తున్న. నేనే కాదు.. కస్టమర్లకు కూడా ఇబ్బంది తప్పింది. కొందరైతే దగ్గరుంచి రిపేర్ చేసుకొని వెళ్తున్నారు. 24గంటల కరంట్‌తో పని సులువైంది.
– టీవీ మెకానిక్, పెద్ది రాజు, మహబూబాబాద్
హనుమకొండ సబర్బన్ : తెలంగాణ రాకముందు మా దుకాణ్ల కరంటన్న ముచ్చటే లేదు. బొగ్గుల పెట్టెలతో బట్టలు ఇస్త్రీ చేసెటోన్ని. జతలకొద్ది డ్రెస్సులు తెచ్చెటోళ్లు. కానీ పెట్టె అంటుకోవాలంటే మస్తు సేపు అయ్యేది. ఊద లేక యాష్ట అనిపిచ్చేది. ఓ దిక్కు ఎర్రటి ఎండ.. ఇంకోదిక్కు బొగ్గుల మంట. ఎండాకాలం బొగ్గుల వేడికి, వానకాలమేమో పెట్టె అంటుకోక సావయ్యేది. గిట్ల ఎన్నో ఏండ్లు గడిపినం. కానీ కేసీఆర్ సార్ ఫుల్ కరంట్ ఇచ్చుడు షురూ చేసి.. మాకు ఇస్త్రీ బండికి ఫ్రీగా ఇచ్చుట్ల నేను సుత కరంట్ పెట్టె కొన్న. కరంట్ బాధ తప్పుట్ల గిరాకోళ్లు బట్టలు ఎప్పుడియ్యి మంటే అప్పుడు ఇత్తున్న. నాలుగు పైసల్ కనవడ్తానయ్. ఇప్పుడు ఏ కాలం అనకుంట టక్కున పని అయిపోతాంది. కేసీఆర్ సారు చేయవట్టి మాకు రంది లేకుంటైంది.
– తీగలపురి సమ్మయ్య, లాండ్రి షాపు యజమాని
జనగామ చౌరస్తా, మే 4: నా పేరు చెట్లపల్లి లింగం. నేను జనగామలోని కనకదుర్గ ఇంజినీరింగ్ వర్క్స్ షాపు నడుపుతున్న. రైతులు, చిన్న చిన్న పరిశ్రమలు, బోరు మోటర్లకు అవసరమైన ఐరన్ పనులు చేసిస్త. లెవెలింగ్ మిషన్‌పై ఐరన్ పైపులను కస్టమర్లు అడిగిన కొలతల్లో కట్ చేసి ఇస్త. నాకు కరంట్తోనే బతుకుదెరువు. అది లేకుంటే పని నడువదు. తెలంగాణ రాక ముందు కరంట్ సమస్య బాగ ఉండె. అప్పుడు రోజుకు 2 గంటలు పనిచేసి, 6 గంటలు ఖాళీగ ఉండేది. సీఎం కేసీఆర్ వచ్చినంక ఆ బాధ తప్పింది. 24గంటలు కరంట్ ఇచ్చుడుతోటి రోజు చేతినిండా పని ఉంటాంది. అన్నం తిన తీరికుంటలేదు.
– చెట్లపల్లి లింగం, జనగామ
నల్లబెల్లి, మే 4: 24 గంటలు కరంట్‌తో వ్యాపారం మంచిగుంది. గతంల నిత్యం పవర్ హాలీడేస్ పెట్టి సరిగ్గ కరంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడేటోళ్లం. రోజూ పడిగాపులు కాసేవాళ్లం. డ్రైవర్లకు జీతాలు ఎల్లుడుకు తిప్పలయ్యేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్ ఆలోచన చేసి 24 గంటల కరంట్ ఇవ్వడంతో మిల్లు రెండు షిప్టులు నడుపుతున్నం. మిల్లు రికాం లేకుండ నడుస్తుండడంతో నెలకు రూ.40వేల నుంచి రూ. 50వేలు వత్తాంది. 24 గంటల కరంటిస్తున్న సీఎం కేసీఆర్‌కు రైస్ మిల్లర్లం రుణపడి ఉంటం.
– పాండవుల రాంబాబు, శివశంకర రైస్‌మిల్లు యజమాని, నల్లబెల్లి
ములుగు రూరల్, మే4: నా పేరు అక్కల పోశాలు. నాకున్న మూడెకరాల్ల సన్నాలు, ఎకరంల పత్తి, రెండు ఎకరాల్ల మిర్చి పండిత్తున్న. తెలంగాణ రాక ముందు కరంట్ సక్కగ ఉండకపోయేది. నీళ్లు పారక పంటలు అంతంత మాత్రంగనే పండేటివి. రాష్ట్రం వచ్చినంక కేసీఆర్ సారు 24 గంటల కరంట్ ఇయ్యడం రైతులకు వరంగ మారింది. గతంల వడ్లు 35 బస్తాలు పండితే గిప్పుడు 40 బస్తాలు పండిత్తాన. పత్తి 14 క్వింటాళ్లు, మిర్చి 25 క్వింటాళ్లు వత్తున్నయ్. పంట చేతి నిండా రావడానికి కారణం నీళ్లే. వాటిని చేన్ల పారించేందుకు ఫుల్ కరంట్ ఉండటమే. కేసీఆర్ సారును మర్చిపోయేది లేదు.
– అక్కల పోశాలు, రైతు, కొత్తూరు, ములుగు
పాలకుర్తి మే 4 : తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక కరంటు కష్టాలు దూరమైనయ్. హాయ్‌గా కిరాణా షాపు నడుపుకుంటున్న. ఇదివరకు కరంటు ఎప్పుడొత్తదో ఎప్పుడు పోతతో తెల్వకపోతుండె. దుకాణంల గంటలకు గంటలు పోయేది. ఎండాకాలంల ఉక్కపోతతో షాపులకు వచ్చేటోళ్లు ఉక్కిరి బిక్కిరయ్యేది. ఇన్వర్టర్ను పెట్టుకునే కాలం గడిపేటోళ్లం. గిప్పుడు ఆ బాధ తప్పింది.
– ప్రసాద్, కిరాణా షాపు యాజమాని, పాలకుర్తి
ఉమ్మడి రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల వారీగా నాలుగు, ఆరు, ఎనిమిది, పన్నెండు గంటల వరకు అధికారికంగా కోతలు ఉండేవి. లోడ్ ఎక్కువైందని, నిర్వహణ పనులని కారణాలతో విధించే కరంటు కోతలు దీనికి అదనం. వైద్య సేవలు, అత్యవసర పరిస్థితి అనేది లేకుండా హాస్పిటళ్లకు కరంటు సరఫరా నిలిచిపోయేది. ఆపరేషన్లు, ఇతర వైద్యసేవలకు అంతరాయం ఏర్పడేది. హాస్పిటల్లో నిరంతర వైద్య సేవలు అందించాలంటే జనరేటర్లే గతి అన్నట్లుండేది. మెడికల్ ల్యాబులలో పరీక్షలదీ ఇదే పరిస్థితి. ఇప్పుడు అంతా మారింది. నిరంతర కరంటు సరఫరాతో ఎక్కువ మంది నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. కరెంటుతోనే కావడంతో ఆమేరకు హాస్పిటళ్లకు నిర్వహణ భారం తగ్గింది. రోగులకు కొంత ఊరట కలుగుతున్నది. నిరంతర కరంటు సరఫరాతో ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్య సేవలు ఎంతో మెరుగయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటళ్ల నిర్వహణపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లలో వసతులు పెరిగినయి. కరంటు నిరంతరంగా సరఫరా చేస్తుండడంతో వైద్య సేవలూ అంతరాయం లేకుండా జరుగుతున్నాయి.
హనుమకొండ సిటీ, మే 4: గతంల పరిశ్రమలకు కరంట్ కొరత తీవ్రంగా ఉండేది. పీక్ లోడ్ అవర్స్ (రాత్రి సమయం)లో కొంత మేరకు మాత్రమే వాడాలనే నిబంధన ఉండేది. అంతకుమించి వాడితే యజమానులకు పెనాల్టీ పడేది. ఇప్పుడు ఇండస్ట్రీస్ నిర్వాహకులు 24గంటల విద్యుత్‌ను ఉపయోగించుకొని పనులు స్పీడ్‌గా చేసుకుంటున్నారు. 2014కు ముందు 7గంటలే కరంట్ ఇచ్చేది. అప్పుడు రైతులు రాత్రిపూట పొలాల దగ్గరికి నీరు పెట్టడానికి వెళ్లి పాముకాటుకో, కరంట్ షాక్‌కో బలయ్యేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.
– కే రాజం, వరంగల్ టౌన్ డీఈ
భూపాలపల్లి టౌన్, మే 4 : మాది గొర్లవీడు. నా భర్త రాజిరెడ్డి వ్యవసాయం చేసెటోడు. పొలానికి నీళ్లు పెట్టడానికి బాయి కాడికి పోయి అక్కడే పండుకునేది. అప్పట్ల కరంట్ ఎప్పుడత్తదో.. ఎప్పుడు పోతది తెలువకపోయేది. ఓ దిక్కు పురుగుబూషి భయం ఉండేది. ఎప్పటిలెక్కనే ఆ రోజు(2001 అక్టోబర్ 15) కూడా బాయి కాడికి పోయిండు. కరంట్ పెట్టేటప్పుడు వైర్లు తాకి చనిపోయిండు. ఇంటికి పెద్ద దిక్కులేక ఆగమైనమ్. అప్పటి గవర్నమెంట్ ఒక్క పైసా పరిహారం కూడా ఇయ్యలే. ఇప్పుడు కేసీఆర్ సర్కారు 24గంటలు ఫుల్ కరంట్ ఇత్తాంది. రైతులకు రంది లేకుంట జేశిండు. ఇప్పట్లెక్కనే నాడు కరంట్ ఉండుంటే నా భర్త చనిపోయెటోడు కాదు.
– కొంరెడ్డి స్వరాజ్యలక్ష్మి, గొర్లవీడు, భూపాలపల్లి మండలం
కరంటు సరఫరాతో వచ్చిన మార్పులతో వాణిజ్యరంగంలో సుస్థిరత ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో పగటిపూట కరంటు ఉండేదికాదు. దుకాణాలు, వాణిజ్య కార్యకలాపాల నిర్వాహకులు గిరాకీ ఉంటుందో లేదో అనే ఆందోళనతో ఉండేవారు. కరెంటు లేని సమయంలో తక్కువ గిరాకీ ఉండేది. జనరేటర్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ ఖర్చును తగ్గించేందుకు యజమానులు తక్కువ మందితోనే వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించేవారు. దీంతో ఉపాధి పరంగా ఇబ్బందులు ఉండేవి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మారింది. నిరంతర కరంటు సరఫరాతో జనరేటర్ల ఖర్చు తప్పింది. దుకాణాలు తీసే సమయం పెరిగింది. వాణిజ్యం ఎక్కువగా సాగుతున్నది. దుకాణాల్లో పని చేసే వారి సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా కరంటు సరఫరా చేస్తుండడంతో ఉపాధిపరంగా, వాణిజ్యపరంగా వృద్ధి నమోదవుతున్నది.