Urea | స్టేషన్ ఘన్ పూర్, ఆగస్టు 18: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. వర్షంలోను లైన్లు కడుతున్నారు. కేసీఆరప్పుడు గిట్ల లైన్లు కట్టలే.. తెలంగాణ రాక ముందు లైన్లు కట్టినం, మళ్లిప్పుడేనంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ లేదా, ఓటిపితోనే యూరియా అందిస్తున్నారని.. ఒక్క పాస్ బుక్కుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు.
ముందస్తు వర్షాలు పడడంతో మురిసిన రైతులు, అటు తరువాత వర్షాలు లేక నారు మల్లు, పత్తి మొక్కజొన్న మొలకలు ఎండిపోతుంటే ఆందోళన చెందిన రైతులు, నేడు యూరియా కోసం వానలో తడుస్తూ లైన్లు కట్టే పరిస్థితి ఎదురైంది. స్టేషన్ ఘన్పూర్ మండలంలో గత నాలుగు రోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో సోమవారం ఏఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి చూడవలసి వస్తుంది.
యూరియా తిప్పలు రైతుల మాటల్లోనే..
కేసీఆర్ ఉన్నప్పుడు గిట్ల లైన్లు కట్టుడు లేకుండే – కత్తుల సమ్మక్క (ఇప్పగూడం, మహిళా రైతు) :
మాకు నాలుగు ఎకరాల పాలం ఉంది, ఎకరానికి రెండు బస్తాలు ఇవ్వమంటే మొత్తంగా రెండు బస్తాలే ఇస్తామని అంటున్నారు. మిషన్లో ఏలు ముద్ర వేస్తేనే యూరియా ఇస్తరట, నా ఏలుముద్ర పడడం లేదు. ఓటిపి చెప్పాలట. గిలాంటి పద్ధతులు నేను ఎప్పుడు చూడలేదు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఏవాడు కూడా యూరియా కోసం లైన్లు కట్టలేదు. తెలంగాణ రాకముందు లైను కడతే, మల్ల ఇప్పుడు లైన్లు కడతానం. మల్లా పది రోజులకు మల్ల యూరియా ఇస్తరట, మల్లి లైన్లు కట్టాలి, మల్లా ఆటో తెచ్చుకోవాలి, అన్ని డబుల్, డబుల్ పనులు అయితానయ్.
అప్పుడు వర్షాలు లేవు, ఇప్పుడు యూరియా లేదు: గట్టయ్య (కృష్ణాజి గూడం, రైతు)
నాకు ఏడు ఎకరాల పొలం ఉంది, ఎన్ని ఎకరాలు ఉన్నా రెండు బస్తాలే ఇస్తామంటున్నారు. మొదట్లో వర్షాలు పడ్డాయి, ఆ తరువాత వర్షాలు లేక ఇబ్బందులు పడ్డం. కాలం పోయింది, ఉన్న నాలుగు మల్లల్లో వారి పెట్టుకుంటే యూరియా లేదు అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు అంతట యూరియా దొరికింది, ఇప్పుడు దొరకడం లేదు, పొద్దున వచ్చినం ఇప్పటి వరకు కూడా యూరియా దొరక్క ముసురు పడుతాంటే కూడా లైన్లు కట్టినం. వ్యయసాయంను నమ్ముకున్న రైతులను అటు దేవుడు కరిణించక, ఇటు ప్రభుత్వం కరిణించక చావాలో, బతకాలో అర్థం కావడం లేదు.
రెండో విడత కూడా యూరియా అందిస్తాం – మహ్మద్. మగ్దుం అలి (పిఎసిఎస్ సీవో)
ఈ పిఎసిఎస్ ద్వారా ఇప్పటి వరకు 6,229 బస్తాల యూరియా రాగా, 5,769 బస్తాల యూరియాను రైతులకు పంపిణీ దేశాం. ప్రస్తుతానికి 460 బస్తాల యూరియా అందుబాటులో ఉంది. డిఏపి 880 బస్తాలు రాగా, 770 బస్తాలు పంపిణీ చేయగా, 110 బస్తాలు పంపిణీ చేశాం. ఎకరం ఉన్న వారికి ఒక బస్తా, ఎకరంపై ఎన్ని ఎకరాలు ఉన్నా రెండు బస్తాలు ఇస్తున్నాము పాస్ బుక్, ఆధార్ కార్డు ద్వారా ఫింగర్ ప్రింట్ రాని యెడల ఓటిపి ద్వారా యూరియా అందిస్తున్నాము. ఇప్పటి వరకు ఏ షాపులో యూరియా తీసుకున్నా ఇప్పుడు ఇవ్వడం లేదు. మళ్ళీ పది రోజుల తరువాత రెండవ విడత యూరియా అందిస్తాము. ఇప్పటి వరకు సుమారు 1300 మంది రైతులకు యూరియా అందించాము, ఇంకా సుమారు 1600 వందల మంది రైతులకు మరో రెండు వందల టన్నుల యూరియా ఇవ్వవలసి ఉంది. రైతులు ఎవరు ఆందోళన చంద వలసిన అవసరం లేదు. రైతులకు సరిపోను యూరియా అందించడం జరుగుతుంది.