Farmer | విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ప్రాణాలు తీసింది. జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) రైతుతో ట్రాన్స్ ఫార్మర్ ఫీజు వైర్ మరమ్మత్తులు చేయించే క్రమంలో కరెంట్ సరఫరా కావడంతో సదరు రైతు షాక్‌తో మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో చోటుచేసుకుంది.
పెండ్యాల భిక్షపతి (39) అనే రైతు పొలానికి నీళ్లు పెట్టేందుకు తన వ్యవసాయ పొలం దగ్గరకు వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఫీజు వైర్ కాలిపోయినట్టు గమనించి, జేఎల్ఎం శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో తాను లైన్మెన్కు చెప్పి ఎల్సీ తీసుకున్నానని.. ఫీజు వైర్ నువ్వే వేసుకోమని జేఎల్ఎం శ్రీనివాస్ రైతు భిక్షపతికి చెప్పాడు. ఈ క్రమంలో భిక్షపతి ఫీజు వైర్ వేస్తుండగా లైన్మెన్ కుమారస్వామి జేఎల్ఎం శ్రీనివాస్‌కు చెప్పకుండా కరెంట్ సప్లైని ఆన్ చేశాడు. విద్యుత్ షాక్ కొట్టడంతో రైతు భిక్షపతి కిందపడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు నిర్దారించారు.