రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట విద్యుత్ షాకుకు గురై రైతులు ప్రాణాలు కోల్పోతున్నా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోని గ్రామ శివారులో విద్యుత్ స్తంభం విరిగి, మెయిన్ వైర్లు నీళ్లలో పడి ప్రమాదకరంగా మారినప్పటికీ పట్టించుకోవట్లేదు.
రేపోని గ్రామ శివారులోని పొలాల వద్ద కొద్దిరోజుల క్రితం విద్యుత్ స్తంభం విరిగిపోయింది. కరెంట్ సరఫరా అయ్యే మెయిన్ వైర్లు పొలంలో పడి నీళ్లలో తడిచి ఉన్నాయి. దీంతో అటువైపుగా వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ విషయం గురించి రైతులు పలుమార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతున్నారు. ప్రాణాలు పోతే తప్ప పట్టించుకోరా అంటూ అధికారుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.