KTR | జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ గుండాల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సాక్షాత్తూ మంత్రి సీతక్క సమక్షంలోనే పట్టపగలు కొందరు కాంగ్రెస్ గుండాలు తాగొచ్చి వీధి రౌడీల్లా వ్యవహరించడం తెలంగాణలో దిగజారిన శాంతిభద్రతలకు అద్దం పడుతోందని విమర్శించారు.
ఒకవైపు ముఖ్యమంత్రి అధికార మత్తులో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే.. కాంగ్రెస్ గుండాలు మద్యం మత్తులో విర్రవీగుతూ విధ్వంసం సృష్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అధికారికంగా జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వద్ద కూడా “డ్రంక్ అండ్ డ్రైవ్” టెస్టులు పెట్టాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొని ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రే స్వయంగా నేరాలను పెంచి పోషించేలా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో లా అండ్ ఆర్డర్ ను తీవ్రంగా దెబ్బతీసే సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ సమాజం కూడా ఈ గడ్డపై ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతిని ఎట్టిపరిస్థితుల్లో సహించదని స్పష్టం చేశారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెట్టిందన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రికి, అధికార పార్టీ అరాచక పర్వానికి తెలంగాణ ప్రజలు తప్పకుండా సరైన గుణపాఠం చెబుతారని అన్నారు.
జనగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై దాడికి యత్నించగా, బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించి అడ్డుకున్నాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి మద్యం మత్తులో తూగుతున్న అనుచరగణంతో కలిసి ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో కొమ్మూరి వర్గం నాయకులు, ఆయన కుమారుడి అనుచరగణం బీఆర్ఎస్, ఎమ్మెల్యే, కేసీఆర్‌ను నిందిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకొని ప్రతి నినాదాలతో కౌంటర్ అటాక్ చేయడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మద్యం మత్తులో ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు పక్కకు తీసుకెళ్లినా వారిని తోసుకుంటూ పెనుగులాటకు దిగాడు.
అధికారికంగా జరుగుతున్న మంత్రి సీతక్క పర్యటనలో అడుగడుగునా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి, చేర్యాల మాజీ ఎమ్మెల్యే కుమారుడు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి తన మార్క్ గూండాగిరిని ప్రదర్శించాడు. పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి పర్యటనను రసాభాస చేసుకోవద్దని, కాంగ్రెస్ నాయకులు కావాలని గొడవ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రహించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులను పలుమార్లు సముదాయించారు. అయిప్పటికీ తన అనుచరగణాన్ని ఎమ్మెల్యే పల్లాపైకి ఉసిగొల్పి దూషణల పర్వాన్ని కొనసాగించారు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డితోపాటు అతడి అనుచరగణం అడ్డుపడటమేంటని ఎమ్మెల్యే పల్లా పోలీసులను ప్రశ్నించడంతో సీఐ సత్యనారాయణరెడ్డి కాంగ్రెస్ నాయకులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. ఈ వివాదంపై మంత్రి సీతక్క సైతం అసహనం వ్యక్తంచేశారు.