బచ్చన్నపేట, మే 26: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎర్ర జెండా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) అన్నారు. బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, జనగామ నియోజకవర్గ మొదటి శాసనసభ్యులు కామ్రేడ్ గంగసాని (గబ్బేట) గోపాల్ రెడ్డి స్మారక స్తూపాన్ని జాన్ వెస్లీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. నాడు సాగిన తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో గోపాల్ రెడ్డి కీలక భూమిక పోషించారన్నారు. ఎర్రజెండా నాయకత్వంలో భూస్వాముల చెర నుంచి పది లక్షల ఎకరాల భూమిని విడిపించారని చెప్పారు. గబ్బేట గోపాల్ రెడ్డి ఆంధ్రమహ సభలో సభ్యునిగా ఉండి బచ్చన్నపేట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు, సాగు భూములు పంచి పెట్టిన గొప్ప మహానేత అని పేర్కొన్నారు.
జనగామ నియోజకవర్గానికి మొదటి శాసనసభ్యులుగా ఎన్నికై జనగామ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు అందించిన గొప్ప త్యాగశీలి గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ దోపిడీ ఉన్నంతకాలం ఎర్రజెండా ప్రజల కోసం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటుందన్నారు. ఎర్రజెండాతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. రాబోయే కాలం అంతా ఎర్ర జెండా రాజ్యమే అని వారన్నారు. ఆనాటి అమరవీరుల త్యాగాలను వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడం కోసమే ఇలాంటి స్తూపాలు నెలకొల్పుతామన్నారు.
ఆపరేషన్ కగార్ పేరుతో అడవి సంపదను బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఆదివాసులపై అకారణంగా కాల్పులు జరుపుతూ ఎన్కౌంటర్ పేరుతో గిరిజనులు, ఆదివాసులను పొట్టన పెట్టుకుంటున్నారన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ అన్నారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని, ఆదివాసుల భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి, పార్టీ నాయకులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, బొట్ల శేఖర్, సుంచు విజేందర్, జోగు ప్రకాష్, బెల్లంకొండ వెంకటేష్, ఎండీ షబానా, గుండెబోయిన రాజు, రావుల రవీందర్ రెడ్డి, అన్నబోయినరాజు, తాడెం రాములు, భైరగొని బలరాములు, ఎల్లయ్య, మన్నే లక్ష్మి, కల్పన, రామగళ్ల అశోక్, కడకంచి బాలరాజ్, గంధమల్ల మనోహర్, గంధమల్ల నరసింహ స్వామి, కనకయ్య, రవి, బాలరాజు, కర్రే రాములు, అన్నబోయిన శీను, రాజేశ్వరి పొన్నాల, రాజవ్వ, చొక్కామ్ సులోచన, తదితరులు పాల్గొన్నారు.