వరంగల్, డిసెంబర్ 19 : గ్రేటర్ వరంగల్‌లో స్మార్ట్‌సిటీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయడం చేతకాక బల్దియా అధికారులు చేతులేత్తేశారు. కొన్నింటిని తొలగించి, మరికొన్నింటిని సగానికి సగం కుదించారు. పదేళ్లుగా కొనసాగుతూ ఇంకా కొన్ని అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఈ నెల 31 నాటికి స్మార్ట్‌సిటీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసి ఫైనల్ బిల్లులు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, సుమారు రూ. 20 కోట్లకు సంబంధించిన 11 అభివృద్ధి పనులు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. వీటిని గడువు లోపు పూర్తి చేయడం అసాధ్యమని తెలుస్తున్నది. ఈ పనులు నత్తనడకన సాగడానికి బల్దియా ఉదాసీనత, లీ అసోసియేట్స్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయకపోతే జరిమానా తప్పదని కన్సల్టెంట్ సంస్థకు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు.
స్మార్ట్‌సిటీ బోర్డులో ఆమోదించిన సుమారు రూ. 300 కోట్ల అభివృద్ధి పనులను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. ఉర్సు రంగ సముద్రం సుందరీకరణ, రోడ్డు 1లో ఫుట్‌పాత్, సెంట్రల్ లైటింగ్‌లను తొలగించారు. గ్రేటర్లో నిర్మించాల్సిన స్మార్ట్‌రోడ్ల ప్రతిపాదనలు తీసివేశారు. స్మార్ట్‌సిటీ పథకంలో గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో రూ. 661 కోట్లతో 94 అభివృద్ధి పనులు చేపట్టగా, అందులో రూ. 20 కోట్లకు సంబంధించిన 11 పెండింగ్‌లో ఉన్నాయి.
భద్రకాళీ బండ్ తో పాటు పోతన బైపాస్ రోడ్డులోని డ్రైనేజీ విస్తరణ, నిర్మాణం, వడ్డేపల్లి బండ్‌పై సుందరీకరణ పనులతో పాటు సివిల్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఉర్సు రంగసముద్రంలో చేపట్టిన గణేశ్ విగ్రహాల నిమజ్జన గుండం నాసిరకం పనులతో కుంగిపోయింది. దానిని కాంట్రాక్టర్‌తో మళ్లీ నిర్మించేలా అధికారులు ఒప్పందం చేసుకున్నారు. అది కూడా మొదలు కాలేదు. పద్మాక్షి రోడ్డు నిర్మాణంతో పాటు అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని గవిచర్ల క్రాస్ రోడ్డు నుంచి కరీమాబాద్ మీదుగా సాకరాశికుంట వరకు నిర్మించిన రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
స్మార్ట్‌సిటీ పనులు డిసెంబర్ 31లోగా పూర్తి చేసి ఫైనల్ బిల్లులు అందజేయాలని ప్రాజెక్ట్ మేనే జ్మెంట్ కనల్టెంట్ (పీఎంసీ) లీ అసోసియేట్స్ సంస్థకు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. చాలా వరకు సివిల్ వర్క్‌లు కావడంతో వాటిని పది రోజుల్లో పూర్తి చేయించడం కష్టమే నని పీఎంసీ చేతులేత్తిసినట్లు సమాచారం.
పదేళ్ల కాలంలో పీఎంసీ ఉద్యోగుల వేతనాల కోసం స్మార్ట్‌సిటీ నిధుల నుంచి రూ. 40 కోట్లు చెల్లించారు. స్మార్ట్‌సిటీ పనులు నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడమే కాకుండా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. పనుల నాణ్యతపై నిఘా పెట్టాల్సిన పీఎంసీ పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పనులన్నీ బడా కాంట్రాక్టర్లు చేపట్టడంతో పీఎంసీతో పాటు బల్దియా అధికారులు నోరు మెదపక పోవడం గమనార్హం.