జనగాం: సీఎం కేసీఆర్ ఇవాళ జనగాం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా జనగాం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 105 మంది దివ్యాంగులకు కోటీ 5 లక్షల రూపాయల విలువైన 105 ట్రై మోటర్ సైకిళ్లను(యాక్టివా స్కూటీ) సీఎం కేసీఆర్ పంపిణీ చేశారు.
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాలకుర్తి నియోజకవర్గంలోని దివ్యాంగులకు ట్రై మోటర్ సైకిల్స్ సమకూర్చినందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వివిధ సంక్షేమ, అభివృద్ధి సామాజిక కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొదలైన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ట్రై మోటర్ సైకిల్స్‌ను దివ్యాంగులకు అందజేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.