న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ కేసును ఇవాళ ఢిల్లీ కోర్టు మూసివేసింది. స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఈ ఆదేశాలు ఇచ్చారు. 23 నిందితులపై సీబీఐ నమోదు చేసిన కేసును క్లోజ్ చేయాలని ఆయన ఆదేశించారు. ఎక్సైజ్ విధానంలో మార్పులు చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మద్యం ఉత్పత్తిదారుల నుంచి ముడుపులు తీసుకున్నట్లు సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో ఆరోపించింది. అయితే ఇదే కుంభకోణంతో లింకున్న మనీల్యాండరింగ్ అంశంలోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసును రిజిస్టర్ చేసింది.
కేజ్రీవాల్, సిసోడియాతో పాటు అనేక మంది రాజకీయ నాయకుల్ని ఈ కేసులో అరెస్టు చేశారు. లిక్కర్ లైసెన్స్‌దారులకు లబ్ధి చేకూర్చేందుకు ఎక్సైజ్ పాలసీలో కావాలనే కొన్ని లొసగులను పొందుపరిచినట్లు ఆరోపణలు వచ్చాయి. రౌజ్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు గతంలో బెయిల్ నిరాకరించడంతో ఈ కేసులో పలువురు నేతలు జైలు జీవితాన్ని అనుభవించారు. అయితే సుప్రీంకోర్టు ఆ తర్వాత వారికి కొంత ఉపశమనం కల్పించింది.
సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో 23 మంది నిందితులు ఉన్నారు. ఆ నిందితులు వీరే. కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై, మూత గౌతమ్, సమీర్ మహేంద్రు, మనీష్ సిసోడియా, అమన్‌దీప్ సింగ్ దాల్, అర్జున్ పాండే, బుచ్చిబాబు గోరంట్ల, రాజేశ్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చరణ్‌ప్రీత్ సింగ్ రాయత్, కల్వకుంట్ల కవిత, అరవింద్ కేజ్రీవాల్, దుర్గేశ్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిశ్ చాంద్ మాథుర్, శరత్ చంద్ర రెడ్డి ఆ లిస్టులో ఉన్నారు.