పచ్చవడ్డ తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు పగబట్టి ఇక్కడి ధాన్యం కొనేదిలేదని అన్నదాతలను ఆగం చేస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొచ్చి గింజ కూడా పోకుండా యాసంగి వడ్లు కొంటామని చెప్పి మరోమారు రైతుబాంధవుడని నిరూపించుకున్నారు. ఇన్నిరోజులుగా నెలక్కొన్న ఉత్కంఠకు తెరదించుతూ రైతుల్లో భరోసా నింపారు. మద్దతు ధర రూ.1960 చెల్లిస్తామని.. ఎవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. ఊరూరా కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోళ్ల కోసం రెండు, మూడు రోజుల్లో అధికారయంత్రాంగం రంగంలోకి దిగుతుందని చెప్పగానే ఉమ్మడి జిల్లా కర్షకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి పలుచోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. కంటికి రెప్పలా కాపాడుకునే సీఎం దేశంలోనే కేసీఆర్ ఒక్కడేనని స్పష్టం చేశారు.
– వరంగల్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ)
నర్సంపేట : సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులకు మేలు కలుగుతుంది. కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయడానికి వెనుకాడడంతో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావడం హర్షణీయం. యాసంగిలో పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ప్రకటించడం ఆనందంగా ఉంది. రాష్ట్రంలో రైతుల కోసం పలు పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ముఖ్యమంత్రి కాపాడుతున్నారు. తెలంగాణలో రైతు సంక్షేమ ప్రభుత్వం కొనసాగుతున్నది.
– సిద్దెన కొమురయ్య, రైతు, అమీనాబాద్
వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తరుణంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నదిది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో యాసంగి వడ్లకు మద్దతు ధర దక్కుతుందని వారిలో భరోసా కనిపిస్తున్నది. ఉత్కంఠకు తెరదించుతూ యాసంగి వడ్లను గింజ కూడా పోకుండా కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ తమ పాలిట దేవుడని కర్షకలోకం కొనియాడుతున్నది. ఆయనకు రుణపడి ఉంటామని ఆనందం వెలిబుచ్చుతున్నది. కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మంగళవారం రాత్రి పలుచోట్ల రైతులు, టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకాలు చేశారు. రేపటి నుంచే వడ్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టం చేయగానే టీవీల వద్ద కూర్చున్న రైతులు, వారి కుటుంబ సభ్యులు సంబురపడ్డారు. ఇండ్ల నుంచి బయటకు వచ్చి ‘జై కేసీఆర్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కొన్నిచోట్ల పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. బుధవారం పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. వడ్ల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ నిర్ణయంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
– వరంగల్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ)
కేసీఆర్ ఉన్నంక మాకేంది..
రాజకీయంగా ఉనికి చాటుకోవాలని కేంద్రపోళ్లు రైతులను ఆగం చేయాలనుకున్నరు. కానీ వాళ్ల ఎత్తులను చిత్తు చేసి రైతులకు భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మొక్కవోని సంకల్ప దీక్షతో వ్యవసాయరంగాన్ని బాగు చేసినందుకే కదా పంటలు బాగా పండి, మన రైతులు తలెత్తుకుని బతికే రోజులు వచ్చినయ్. ఇవన్నీ చూసి ఓర్వక బీజేపీ సర్కారు లేనిపోనివి చెప్పి రైతులను ఆగంచేయాలనుకున్నది. అవీఇవీ అని షరతులు పెట్టి వడ్లు కొనమని కిరికిరి పెట్టింది. కానీ వాళ్ల మాటలు ఎవరు ఇంటరు. మోదీ సర్కారు ఎన్ని కథలవడ్డా ఇక్కడ ఉన్నది కేసీఆర్. ఆయన రైతు బిడ్డ, రైతుల గుండెల్లో ఉన్న బిడ్డ అని మరువద్దు. రైతుల కోసమే కాదు, తెలంగాణ ప్రజల బాగు కోసం ఎంతటి పోరాటానికైనా ఎనకడుగు వేయడు. ఆయన బలం తెలంగాణ ప్రజలు, బలహీనత ప్రజలు. వాళ్లు రంది పడితే చూస్తూ ఊరుకోడు. అందుకే వాళ్లు కొనకుంటే మేమే వడ్లు కొంటమని చెప్పి కొండంత ధైర్యం ఇచ్చిండు.
– బొల్లు సరోత్తంరెడ్డి రైతు, టేకుమట్ల
మా మేలు కోరేది ఒక్కడే..
రైతుల మేలు కోరేది ఒక్క కేసీఆరే. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం హర్షనీయం. రైతులు యాసంగిలో వరి పంటలు వేసుకుని ధాన్యం అమ్ముకునేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తివేసింది. ఈ పంటలను కొనుగోలు చేయడమే కాకుండా మద్దతు ధరను కూడా రూ.1960 ప్రకటించి అతి తొందరగా కొనుగోలు సెంటర్లు కూడా ప్రారంభిస్తామని చెప్పడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ రైతులకు ఎంతో మనోధైర్యం కల్పించారు. తెలంగాణ రైతులకు పెద్ద దిక్కుగా కేసీఆర్ ఉంటున్నారు. ఇప్పటికే రైతులకు పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు.
– ఇటుకాల యాకయ్య, రైతు, గుండ్రపెల్లి, నర్సంపేట
రైతులకు పెద్ద దిక్కు కేసీఆరే..
తెలంగాణలో ఎప్పటికైనా రైతులకు పెద్ద దిక్కు కేసీఆరే. యాసంగిలో వడ్లు కొనాలని కేసీఆర్ ఎన్నిసార్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా వారు పట్టించుకోలేదు. పైగా మన రైతులను అవమానించేలా మాట్లాడారు. యాసంగిలో వడ్లు కొనమని కేంద్రం చెప్పడం వల్ల రైతులు దళారులకు అగ్గువకు అమ్ముకొని నష్టపోకుండా మేమే కొంటామని కేసీఆర్ చెప్పడం సంతోషాన్నిచ్చింది. వరి కోతకు వచ్చింది చేతికి వచ్చిన వడ్లు ఎవరికి అమ్ముకోవాలని దిగులు పడ్డా. ఇప్పుడు కేసీఆర్ సారే వడ్లు కొంటని చెప్పిన తర్వాత ధైర్యం వచ్చింది.
– గండ్రకోట మొగిలి, రైతు, ఉప్పల్, కమలాపూర్
నష్టపోకుండా ఆదుకున్నడు..
వరంగల్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి వడ్లు కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ నిర్ణయంతో ఆయన రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. తెలంగాణ వడ్లు కొనేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు అడ్డమైన షరతులు పెట్టి.. రైతులను ఇబ్బంది పెట్టాలని చూసింది. ఆ బియ్యమే కొంటం.. ఇవి కొనమంటూ కిరికిరి పెట్టింది. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు మా రైతుల పక్షాన కేసీఆర్ మొదలుపెట్టిన ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్లింది. అయినా కేంద్రం పట్టించుకోకపోవడంతో రైతులకు ఆగం కావద్దని ధాన్యం కొనేందుకు ముందుకొచ్చి కొండంత ధైర్యం ఇచ్చారు. టీవీల ముందు కూర్చుని కేసీఆర్ ప్రకటన విన్న రైతులందరూ చాలా సంతోషపడుతున్నరు.
– ఊరటి మహిపాల్‌రెడ్డి, రైతు, వెంకటాపురం, దుగ్గొండి
రైతుబాంధవుడు..
సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని మరోసారి రైతుల గుండెల్లో నిలిచిపోయాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనమని చెప్పినా సీఎం కేసీఆర్ మా సంక్షేమం కోసం ప్రతి ధాన్యం గింజ కొంటామని చెప్పడం చాలా సంతోషంగా ధైర్యంగా ఉంది. బీజేపీ నాయకులు, బీజేపీ రైతు సమస్యలపై రెండు రకాల మాటలు మాట్లాడినా కేసీఆర్ మాత్రం ఎప్పుడు కూడా రైతుల మేలు కోసం ఆలోచిస్తాడు. ధాన్యం కొనాలని పలుమార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన ఫలితం లేకపోవడంతో మేము నష్టపోవద్దని ధాన్యం కొంటామని ముందుకొచ్చాడు. రైతులకు ఇంతకన్నా ఏం కావాలి.
– గుగులోత్ వాసునాయక్, దుబ్బతండా, పాలకుర్తి రూరల్
రందిలేకుంట చేశిండు..
రైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగిలో పండించిన ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. రెండు మూడు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి క్వింటాల్‌కు రూ.1960 ఇస్తామని చెప్పి రైతుల్లో భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్ర ప్రభుత్వం లేనిపోని షరతులు పెట్టి కొనకుంట తప్పించుకున్నది. కానీ పంట చేతికచ్చే సమయంలో రైతులు బాధపడద్దని సీఎం కేసీఆర్ వడ్లు కొంటనని చెప్పి రంది లేకుంట చేసిండు. గ్రామాల్లో కాంటాలు పెట్టడంతో పాటు మద్దతు ధర కూడా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.
– జాటోత్ శ్రీను, ఎర్రచకృతండా, నర్సింహులపేట
ఆయనే ఒక ధైర్యం..
నాడు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాలను కూడ లెక్కచేయలేదు. ఇవ్వాళ కేంద్రం యాసంగి ధాన్యం కొనమని మొండికేస్తే రైతులు నష్టపోవద్దని ఆయనే ముందుకొచ్చిండు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించి రైతుల్లో ధైర్యం నింపిండు. నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి దొరుకుడు మా ఆదృష్టం. ఏది చేయాలన్నా కేసీఆర్‌కే సాధ్యం. యాసంగి ధాన్యం కేంద్రం కొనకపోతే రైతులు ఆగమైతరని, బ్రోకర్ల చేతిలో నష్టపోతరని, రైతుల పడ్డ కష్టం వృథా పోతుందని మా కోసం ఆలోచన చేశిండు. అందుకే వాళ్లు కొనకపోయినా మేం కొంటామని కేసీఆర్ చెప్పిండు. ఇలాంటి మనసున్న ముఖ్యమంత్రికి మేం ఎప్పుడూ అండగా ఉంటం.
– రాగి రాజు, రైతు, థానేధార్పల్లి, స్టేషన్ ఘన్పూర్
మా వెంటే కేసీఆర్
రైతుకు ఏ సమస్య వచ్చినా నేనున్నా అని కేసీఆర్ భరోసా ఇస్తున్నడు. తెలంగాణ వచ్చినంక ప్రతి ఎకరాకు నీళ్లిస్తానని మాటిచ్చి చెప్పినట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పుష్కలంగా నీళ్లు ఇత్తాండు. పంట సాయం కోసం రైతుబంధు, సబ్సిడీ కింద ఎరువులు, టైమ్‌కు ఇత్తనాలు రావట్టె. ఇదంతా ముఖ్యమంత్రి పుణ్యమే. ఇగ ఎప్పుడూ లేంది యాసంగి వడ్లు కొనమని గా కేంద్రపోళ్లు చెప్పుట్ల ఆగమైనం. పంట ఏశి వడ్లు చేతికచ్చే మోపున ఇదేందని నెత్తి వట్టుకున్నం. ఇంతల్నే కేసీఆర్ సారు మా కోసం ఢిల్లీల దీక్ష జేశిండు. అయినా కేంద్ర సర్కారు సప్పుడుచేయకుండా.. మాకు నష్టం కావద్దని మళ్లీ ఆయనే ముందుకచ్చి వడ్లు కొంటనని చెప్పిండు. టీవీల కేసీఆర్ మాటలు ఇన్నంక ధైర్నమచ్చింది. ఇంకో పది రోజుల్ల వరి కోతలు మొదలువెడ్తం. మమ్ముల గోసవుచ్చుకున్న బీజేపోళ్లకు గట్టిగ బుద్ధిచెప్తం.
– సమ్మెట లక్ష్మీనారాయణ, రైతు, వర్ధన్నపేట