నమస్తే నెట్వర్క్, ఆగస్టు 12 : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వానకు జనజీవనం స్తంభించిపోయింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షం కురవగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర, కొత్తగూడ, గూడూరు, కేసముద్రం, తొర్రూ రు మండలాల్లో భారీ, ములుగు జిల్లా కేంద్రంలో మోస్తరు వర్షం పడింది. వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగగా, చెరువులు, కుం టలు మత్తళ్లు దుంకాయి.
రోడ్లు, లోలెవల్ కాజ్‌వేల పైనుంచి వరద ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, ప్రధాన జలాశయాల్లోకి భారీగా నీరు చేరింది. పలుచోట్ల ఇండ్లలోకి నీరు చే రగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా, వరంగల్, హనుమకొండ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో జనజీవనం స్తంభించింది. ఎన్నడూ లేని విధంగా వరంగల్ రైల్వే స్టేషన్‌లోని ట్రాక్‌పైన మూడు అడుగుల మేర నీరు నిలిచింది. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా నీరు చేరడంతో వేగంగా వెళ్లిన ఒక కారు అందులో మునిగిపోయింది. వెంటనే స్థానికులు జేసీబీ సహాయంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను కాపాడి కారును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వృద్ధులు, చిన్నారులను వరద నుంచి రక్షించారు.
ముంపు ప్రాంతా ల్లో కలెక్టర్ సత్యశారద, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పర్యటించారు. కాగా, వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, సంగెం మండలంలో అత్యధికంగా 17.84 సెం.మీ. కురిసింది. అలాగే ఖిలావరంగల్‌లో 15.5, వరంగల్‌లో 14.88, వర్ధన్నపేటలో 12.55, ఖానాపూర్‌లో 10.8 8, రాయపర్తిలో 9.08, గీసుగొండలో 9.04, పర్వతగిరిలో 8.96, చెన్నారావుపేట 8.57, దుగ్గొండిలో 8.42, నెక్కొండలో 8.24, నల్లబెల్లిలో 6.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి 100 పడకల ఆస్పత్రిలోకి నీరు చేరడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. అలాగే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 2.7 సెంటీ మీటర్ల వర్షం కురవగా, పెద్దవంగరలో 12, తొర్రూరులో 10.5 సెంటీ మీటర్లు నమోదైంది.