గిర్మాజీపేట/ఖిలావరంగల్/నల్లబెల్లి/శాయంపేట/కాజీపేట/మడికొండ, జూన్ 2: వరంగల్ నగరంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో జోరు వాన కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. స్టేషన్రోడ్, బట్టలబజార్, వరంగల్చౌరస్తా, రామన్నపేటలో వరదనీరు రోడ్లపై ప్రవహించింది. కాగా, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర ప్రజలు భారీ వర్షంతో ఉపశమనం పొందారు. కాగా, డీజిల్ కాలనీ చౌరస్తా సమీపంలోని డ్రైనేజీలు పొంగి పొర్లడంతో వర్షం నీరు రోడ్లపై నిలిచి, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపైన విరిగి పడిన చెట్లను స్థానికులు తొలగించారు. ఒకసారిగా వీచిన గాలి దుమారంతో పలు కాలనీల్లో విద్యుత్ స్తంభాలు విరిగి పడగా, గంటల తరబడి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాజీపేట రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం, పట్టాల పైకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నల్లబెల్లి, శాయంపేట మండలాల్లో కుండపోత వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. కాగా, వరంగల్ జిల్లావ్యాప్తంగా సగటున 33.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ తెలిపింది. చెన్నారావుపేట మండలంలో అత్యధికంగా 52.8 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా దుగ్గొండిలో 15.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.