వరంగల్ నగరానికి ఈసారీ ముంపు ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఏటా వరదలు ముంచెత్తినా బల్దియా శాశ్వత నివారణ చర్యలు చేపట్టకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. రెండేళ్ల క్రితం ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన అప్పటి మంత్రి కేటీఆర్.. శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని.. అవసరమైన డీపీఆర్‌లు సమర్పించాలని సూచించినా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
రెండు, మూడు సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకొన్నది. గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 250 కోట్ల నిధులు బల్దియా వినియోగించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఈ విషయమై దృష్టి సారించకపోవడం.. నాలా విస్తరణ పనులు నత్తనడకన సాగడం.. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడం.. భద్రకాళీ చెరువు పూడికతీత పూర్తికాకపోవడం.. ఈసారి ముందే వర్షాలు కురుస్తుండడంతో నగర ప్రజలు మరోసారి ముంపు తప్పదా? అనే భయాందోళనకు గురవుతున్నారు.
– వరంగల్/కరీమాబాద్, మే 27
వానకాలం వస్తున్నదంటే నగర వాసులు వణికిపోతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రెండేళ్ల కిత్రం నగరం ముంపునకు గురైన సమయంలో అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. శాశ్వత ముంపు నివారణకు ప్రణాళికలు సమర్పించాలని బల్దియా, జిల్లా యంత్రాంగానికి దిశా నిర్థేశం చేశారు.
ఇందుకోసం రూ.250 కోట్లు ప్రకటించిన కేటీఆర్ ముఖ్యంగా నగరంలోని ప్రధాన నాలాలను రెవెన్యూ, ఇరిగేషన్, బల్దియా శాఖలు సమన్వయంతో సర్వే చేసి వాస్తవ హద్దులు నిర్ణయించాలని సూచించారు. నాలాల విస్తరణ చేపట్టి, రెయిలింగ్‌లు ఏర్పాటు చేయాలని, వరద నీటిని మళ్లించే చర్యలు చేపట్టాలన్నారు. అయితే అవసరమైన ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడంలో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వినియోగించుకోకపోవడంలో పూర్తిగా విఫలం కావడంతో రూ. 250 కోట్లు నిరుపయోగంగా మారాయి.
నత్తనడకన విస్తరణ పనులు
నగరంలోని నాలాల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హనుమకొండలోని నయీంనగర్ నాలా పనులు వేగంగా పూర్తి చేసినా, వరంగల్‌లో పోతననగర్ నాలా పనుల్లో ఆలస్యం జరుగుతున్నది. 12 మోరీల నుంచి పోతననగర్ గుడిసెకాలనీ వరకు నాలా పనులను అస్తవ్యస్తంగా చేస్తున్నారు. ఈ సారి ముందస్తుగానే వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు నాలా విస్తరణ, డ్రైనేజీ పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. అవసరమైన నాలా విస్తరణ, డ్రైనేజీ పనులు పక్కనపెట్టి భద్రకాళీ బండ్ రెండో ప్రవేశ ద్వారం కోసం స్లాబ్ నిర్మాణం చేస్తున్న అధికారుల తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు పడితే రామన్నపేట, పోతననగర్ పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీలు అస్తవ్యస్తం
అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని సాకరాశికుంట నాలా, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడంతో వరదనీరు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. ఏటా మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ వెనకాల ఉన్న మెట్టు చెరువు నీరు, రంగశాయిపేట, శంభునిపేట ప్రాంతాలు, భట్టుపల్లి, అమ్మవారిపేట, ఉర్సు చెరువుల నుంచి వచ్చే వరదతో అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని పలు కాలనీలు మునుగుతున్నాయి. అలాగే కాశీకుంట, విద్యానగర్‌కాలనీ, జన్మభూమి జంక్షన్ రోడ్డు, సాకరాశికుంట, లక్ష్మీనగర్, ఎస్‌ఆర్‌ఆర్‌తోట ముంపునకు గురవుతున్నాయి. దీంతో పాటు భట్టుపల్లి, అమ్మవారిపేట, శాయంపేట, ఉర్సు చెరువుల నుంచి వచ్చే నీటితో ఎన్ఎన్నగర్, బీఆర్‌నగర్, రాజీవ్‌నగర్ ప్రాంతాలు మునుగుతున్నాయి.
బొందివాగుపై అదే నిర్లక్ష్యం
వరంగల్ నగర ముంపునకు ప్రధాన కారణంగా నిలుస్తున్న బొందివాగు నాలాపై అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని వరద శాకరాశికుంట నాలా, అమ్మవారిపేట చెరువు వరద నీరు బొందివాగు ద్వారా వెళ్తున్నది. అయితే బొందివాగు ఆక్రమణకు గురికావడంతో వరదంతా ఇండ్లలోకి వస్తున్నది. గతంలోనే బొందివాగును సర్వే చేసి వాస్తవ హద్దులు ఏర్పాటు చేసి విస్తరించాలని సూచించినా బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
బొందివాగు వరద ఉధృతి పెరిగితే భద్రకాళీ చెరువులోకి తరలించి కాపువాడ మత్తడి వైపు నుంచి బయటకు వదలాలనే ప్రతిపాదన ఇప్పటికీ కార్యాచరణలోకి రాలేదు. భద్రకాళీ చెరువు పూడిక తీత పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో మళ్లీ సాయినగర్, ఎన్టీఆర్ కాలనీ, సంతోషిమాత కాలనీ, హంటర్ రోడ్డు ప్రధాన రహదారి ఈసారి కూడా మునగడం ఖాయంగా కనిపిస్తున్నది. అలాగే స్టేషన్ రోడ్డు నుంచి వచ్చే వరదనీరు మేదరవాడ మీదుగా 12 మోరీలకు చేరాల్సి ఉండగా, వరంగల్ చౌరస్తా ప్రాంతంలోని కల్వర్టులో మిషన్ భగీరథ పైప్‌లైన్ వేయడంతో ఆ ప్రాంతమంతా చిన్న వర్షానికే ముంపునకు గురవుతున్నది.