సాగు నీరు లేక పంటలు ఎండి రైతన్న గుండె మండుతున్నది. చివరి తడి కోసం అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. వాగుల్లో చెలిమలు తీసి ఒక్కో బొట్టును ఒడిసి పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పదేళ్లలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు లోలోతుకు పడిపోవడం ఇదే తొలిసారి. దీంతో బోరు, బావులూ ఎండి రైతన్నలకు సాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. మార్చిలోనే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో సమస్య మరింత జఠిలం కానుంది. ఈ ఏడాది తాగడానికి కూడా తండ్లాట తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
– మహబూబాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ)
ఒక్క నెలలోనే సగటున 0.82 మీటర్ల భూగర్భ జలాలు లోతుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. చివరి తడి కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వాగులు, చెక్‌డ్యాంలు, చెరువులు, కుంటలు, ఎస్పారెస్పీ కాలువల్లో ఇలా ఎక్కడ దొరికితే అక్కడి నుంచి మోటర్లు పెట్టి పా రిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వరి పొట్టకొచ్చి ఉన్నది 40శాతం అయితే, ఈనింది 60 శాతం వరకు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. పొట్టకొచ్చిన వరికి 20-25 రోజులు, ఇప్పటికే ఈనిన వరి కోసం అయితే 15 నుం చి 20రోజుల పాటు సాగునీరు అవసరం.
గత బీఆ ర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాల్వల ద్వారా కాళేశ్వరం నీళ్లను తెచ్చి చెరువులు, కుంటలు, వాగుల్లో ఉన్న చెక్ డ్యాంలను నింపడంతో 30శాతానికి పైగా భూగర్భ జలాలు వృద్ధి చెందేవి. వేసవిలో సైతం పుష్కలంగా నీరు ఉండేది. ఇప్పు డా పరిస్థితి లేకుండా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో సాగునీరందించకపోవడంతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు ఎండిపోయి భూగర్భ జలమట్టం పూర్తిగా పడిపోయింది. దీంతో బోరు బావులు సైతం నీళ్లు లేక రైతులు చివరి తడి కోసం భగీరథ యత్నం చేస్తున్నారు. ఎంత చేసినా చాలా చోట్ల తమ పంటలను కాపాడుకోలేకపోయామని విలపిస్తూ పశువులు, గొర్లను మేపుతున్నారు.
ఎస్సారెస్పీ మొదటి దశ, రెండో దశ పనులు పూర్తి చేసి సూర్యాపేట జిల్లా ఆఖరి ఆయకట్టు వరకు నీరందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దకుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిం చి అకడి నుంచి మిడ్ మానేరు, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు, వాగుల్లో ఉన్న చెక్‌డ్యాములను నింపి చివరి ఆయకట్టు పండించే వరకు నీరందించింది.
ఎస్సారెస్పీ మొదటి దశలో డీబీఎం 48 ద్వారా కేసముద్రం, మహబూబాబాద్, కురవి, డోర్నకల్ మండలం వెన్నా రం వరకు సాగునీరు అందించింది. రేవంత్ సరారు అధికా రంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించి రైతులకు నీరు లేకుండా చేసింది. మొదటి దశకు నీళ్లు రాకపోవడంతో ఇప్పుడు వరి పంట సగం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వరి ఈనుతున్న సమయంలో తడి లేక మడి ఎండుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సారెస్పీ డీబీఎం 60 ప్రధాన కాల్వ తొర్రూరు మండ లం నాంచారిమడూరు, పటేల్‌గూడెం నుంచి మరిపెడ వరకు 45 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. జిల్లాకు ప్రతి రో జూ 1200 క్యూసెకుల నీరు రావాల్సి ఉండగా 650 క్యూ సెకులే వస్తున్నది. గతంలో నిరంతరంగా మే నెలలో కూడా సాగునీరు వచ్చేది. ప్రస్తుతం వారం విడిచి వారం వస్తున్నది. ప్రస్తుతం కాల్వ కింద 8 వేల ఎకరాల్లో ఇప్పటికే 2వేల ఎకరాల వరి పంట ఎండిపోయింది. మరో నాలుగు రోజులు గడిస్తే మ రో 2 వేల ఎకరాలకు నీరందని పరిస్థితి. జిల్లాలో డీబీఎం 57, 59 కాల్వ పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. నీళ్లు రాకపోవడంతో రైతు లు అరిగోస పడుతున్నారు.
పెద్దవంగర, మార్చి16: పదేళ్లలో ఎప్పుడూ కూడా గుంట భూమి కూడా ఎండలే. యాసంగి దినమని నాకున్న మూడెక రాల్లో రెండు ఎకరాల్లో వరి పంట వేసిన. ఇప్పుడు పంటకు నీరు లేక పశువులకు మేతగా మారి.. మాకు కన్నీరు మిగిలింది. ఎప్పుడు లేనంతగా భూగర్భ జలాలు అడుగంటడంతో పెట్టిన పెట్టుబ డి రాక పశువులకు మేతగా మిగలడంతో మా గోస చెప్పుకోవడానికి ఎంతో కష్టంగా ఉంది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– పాయిలి శంకరయ్య, రైతు, గంట్లకుంట, పెద్దవంగర