SEETHAKKA | ఏటూరునాగారం : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని, రాష్ట్రంలో రూ.23 వేల కోట్ల వడ్డీ రుణాలు అందజేసినట్లు పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో సీతక్క శనివారం పాల్గొన్నారు. ఐటిడిఏ కార్యాలయం ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించి, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, చేతి కర్రలు, వినికిడి పరికరాలు అందజేశారు. 50 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. రూ.9కోట్ల వడ్డీని మహిళా సంఘాలకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏటూరు నాగారంలోని చైతన్య మండల సమాచారం రూ.86 లక్షల చెక్కును అందజేశారు. కొండాయి సమీపంలోని చెంపన్న వాగుపై రూ.16 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఏటూరునాగారంలో బస్సు డిపో మంజూరు చేసామని వచ్చే నెల టెండర్లు పిలవడం జరుగుతుందని తెలిపారు. ఏటూరు నాగారంలో బస్సు డిపో అవసరాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె వివరించారు. ములుగులో బస్టాండ్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటిడిఏ కార్యాలయ భవనాలు శిథిలావస్థలో ఉన్నందున ఒక్కో భవనానికి రూ.15 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
దివ్యాంగులు తీసుకున్న ఉపకారణాలతో కొత్త జీవితం ప్రారంభించుకోవాలని సూచించారు. మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, మండలాలకు చెందిన 297 మంది లబ్ధిదారులకు రూ.40 లక్షల విలువచేసే ఉపకరణాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వెంట కలెక్టర్ దివాకర టీ ఎస్, శివం ఉపాధ్యాయ, డిఆర్డిఓ సంపత్ రావు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.