ఐనవోలు, అక్టోబర్ 27 : వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన సీఎం కేసీఆర్కు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం ప్రసాదాన్ని వరంగల్ జిల్లా బీఆర్ఎప్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అందజేశారు. ప్రజా అశీర్వాద సభలో పాల్గొని మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యే అరూరి, డీసీసీబీ మార్నేని ఐనవోలు మల్లికార్జునస్వామి లడ్డూ ప్రసాదం, స్వామి శేష వస్త్రం, స్వామి చిత్ర పటాన్ని సీఎం కేసీఆర్కు అందజేశారు.
వర్ధన్నపేట సభలో సీఎం కేసీఆర్ ఐనవోలు మండలం పేరు ఉచ్ఛరించడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు. నిండు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఐనవోలు మండలానికి దేవాదుల నీళ్లు ఇస్తున్నట్లుగా గుర్తు చేయడంతో మండల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ ఫూలింగ్ వల్ల ఎక్కువ శాతం ఐనవోలు రైతులకు నష్టం జరుగుతుందని గతంలో అందోళనలు చేసిన విషయం తెలిసిందే. ప్రజా ఆశీర్వాద సభలో స్వయంగా సీఎం కేసీఆర్ రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ ఫూలింగ్ ఉండదని ప్రకటించడంతో రైతులందరూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.