వరంగల్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభంతో జిల్లాలో పండుగ వాతావరణం కనిపించింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వాడవాడన సంబురాలు జరుపుకున్నారు. కూడళ్లు, జంక్షన్ల వద్ద పెద్ద ఎత్తున పటాకులు కాల్చి, మిఠాయిలు పంచారు. ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలు పలువురు హాజరయ్యారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును ఇటీవల బీఆర్ఎస్గా మార్చిన విషయం తెలిసిందే. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుం కట్టిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ఢిల్లీలో సర్దార్ పటేల్ మార్గ్‌లోని తాత్కాలిక భవనంలో కేంద్ర కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీలు, డీసీసీబీల చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్లు, పార్టీ ముఖ్యనేతలు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నుంచి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేట, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఓడీసీఎం ఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీ నాయక్‌తో పాటు ముఖ్య నేతలు పలువురు ఢిల్లీకి తరలివెళ్లారు. కేంద్ర కార్యాలయం ప్రారంభంతో బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు పటాకులు కాల్చారు. బీఆర్ఎస్ జెండాలతో వాడవాడన ర్యాలీలు నిర్వహించారు. జై బీఆర్ఎస్, జైజై కేసీఆర్ నినాదాలు చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ గ్రామ, వార్డు, డివిజన్, పట్టణ, మండల స్థాయి నేతలు సంబురాల్లో పాల్గొన్నారు.