పరకాల, అక్టోబర్ 28 : ‘పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్లో గుర్తింపు లేదు. పరకాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం 12 ఏండ్లుగా కష్టపడుతున్నా.. నాకు టికెట్ ఇవ్వకుండా వారం కింద చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇచ్చుడేంది?’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పరకాల టికెట్ రేవూరికి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హనుమకొండలోని తన నివాసంలో అనుచరులు, ముఖ్య నాయకులతో శనివారం సమావేశమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ‘కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న రోజు నుంచి నేటి వరకు క్రమశిక్షణ గల నాయకుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన. అయినా నాకు గుర్తింపు ఇవ్వకుండా వలస నాయకులకు టికెట్ ఇచ్చిన్రు. కొంత మంది అధిష్టానం పెద్దల సూచనతో పరకాల టికెట్ నాకే వస్తుందని శుక్రవారం వరకు ఆశపడ్డ. కానీ, కాంగ్రెస్ పెద్దలు నాకు మొండిచెయ్యి చూపెట్టిండ్రు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే కాంగ్రెస్కు రాజీనామా చేసి స్వతంత్రంగా బరీలోకి దిగుతానని చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తన ఇంటికి వచ్చిన అధిష్టానం దూతలు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి శోభారాణి సర్ది చెప్పినా ఇనగాల శాంతించలేదు. తనకు 24గంటల్లో టికెట్ కేటాయించకుంటే తనదారి తాను చూసుకుంటానని వారిని హెచ్చరించారు.