హనుమకొండ, జనవరి 12: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు గుండాగిరి చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాంగ్రెస్ దౌర్జాన్యాలకు, తమ పార్టీ నేతలపై అక్రమ కేసులకు భయపడమని స్పష్టం చేశారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ మూకల దాడిని ఖండిస్తున్నామన్నారు.
చర్యకు ప్రతి చర్య ఉంటుందని, దాడులకు ప్రతి దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. పార్టీలు ఏవైనా, వాటి కార్యాలయాలు ఆయా పార్టీలకు పవిత్ర దేవాలయాలవంటివని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు అన్నారు. ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాడుతోందని, అందుకే పార్టీ కార్యాలయంపై దాడి చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది గులాబీ సైనికులున్నారని, కాంగ్రెస్ నేతలు దాడికి దిగితే తాము ప్రతి దాడి చేస్తామని స్పష్టం చేశారు.
పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాకు శాంతియుత మార్గాన్ని సూచించారని, అదే మార్గంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామన్నారు. మాకు పోరాటాలు, కేసులు కొత్త కాదని, ఎన్ని కేసులు పెట్టినా, దాడులు చేసినా భయపడమని వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, వరంగల్ పశ్చిమ ని యోజకవర్గ పార్టీ కో-ఆర్డినేటర్ పులి రజినీకాంత్, బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్ర శాంత్, నాయకులు రవీందర్రావు, ప బ్బో జు శ్రీకాంతాచారి, వీరస్వామి, పోలపల్లి రామ్మూర్తి, రఘు, పానుగంటి శ్రీధర్, పెద్ది రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.