జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ దందా హద్దులు దాటుతున్నది. ఇందుకు అంతర్రాష్ట్ర వారధులు స్మగ్లర్లకు రాచమార్గాలుగా మారాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ చెక్ పోస్టులు లేకపోవడం వారికి కలిసొస్తున్నది. సరిహద్దుదారుల్లో గంజాయి, నకిలీ విత్తనాలు, వన్యప్రాణు ల మాంసం, కలప అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం తదితర ఇల్లీగల్ దందాలు జోరుగా సాగుతున్నా యి. అడపాదడపా పౌరసరఫరా శాఖ అధికారులు, ఎన్నికల సమయంలో పోలీసులు చెక్‌పోస్టులు ఏ ర్పాటు చేసి చేతులు దులుపుకున్నా స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. అక్కడ పర్మినెంట్ చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ నెరవేరడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం వంతెనల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయకపోవడంతో అక్రమ వ్యాపారాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది.
– జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 14(నమస్తే తెలంగాణ)
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వంతెనల వద్ద పోలీస్ చెక్‌పోస్టులు కానరావడం లేదు. సందర్భాన్ని బట్టి మాత్రమే ఆయా శాఖలు పోలీసుల ఫోర్స్‌తో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తూ అనంతరం ఎత్తివేస్తున్నా యి. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి సాగునీటి అవసరాలు తీర్చేందుకు లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ)ను నిర్మించింది. ఈ బరాజ్ రైతుల సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు దానిపై నిర్మిం చిన రహదారి రెండు రాష్ర్టాల ప్రజలకు దూరా భారాన్ని తగ్గించే వారధిగా నిలిచింది. అయితే ఇది స్మగ్లర్ల కు వరంగా మారింది.
బరాజ్ ఏర్పాటు చేసిన అంబట్పల్లి గ్రామం జిల్లాలోని మహదేవపూర్ మండ లంలోని మారుమూల గ్రామం కావడంతో ఇటువైపు పోలీస్ ఫోకస్ తక్కువగా ఉంటుందని గమనించి న స్మగ్లర్లు తమ కార్యకలాపాలకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో అంబట్పల్లి వద్ద గల మేడిగడ్డ బరాజ్ వద్ద గతంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్ జవాన్ల క్యాంపుతో సెక్యూ రిటీ నిర్వహించేవారు. ప్రస్తుతం గాలికొదిలేశారు. అలాగే అన్నారం బరాజ్ వద్ద సైతం పోలీసు చెక్‌పోస్టు లేదు. ఇక కాళేశ్వరం నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే ప్రధాన వంతెనపై సైతం ఎలాంటి చెక్‌పోస్టు లేకపోవడం, తనిఖీలు నిర్వహించకపోవడం స్మగ్లర్లకు వరంగా మారుతోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లోని తెలంగాణ, మహారాష్ట్ర బార్డర్ నుంచి అక్రమ దందా లు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈక్రమంలో చీకటి వ్యాపారాలు వెలుగుచూస్తూ పోలీసులకు పట్టుబడు తున్న దాఖలాలున్నాయి. పోలీసుల తనిఖీలు ఎక్కువగా లేకపోవడంతో అక్రమ దందాలు హద్దులు దాటుతున్నాయనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నెల 6న కొయ్యూరు పోలీసులు రూ. 65 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ గంజాయి సరిహద్దులు దాటి వచ్చినట్లు నిర్ధారించారు. సరిహద్దు ఆవల గ్రామాల్లో గంజాయిని అంతర్పంటగా సాగు చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు దాటిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 8న మహారాష్ట్రకు తరలివెళ్తున్న 98 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రేగొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల జిల్లాలోని చిట్యాల మండలంలో రూ. 32 వేల విలువ గల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విత్తనాలు సైతం సిరోంచ నుంచి తీసుకువచ్చినట్లు దళారులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి ఎక్కువగా వన్యప్రాణుల మాంసం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. భూపాలపల్లి పట్టణానికి సైతం సరిహద్దుకు ఆవల ఉన్న గ్రామాల నుంచి అడవి జంతువుల మాంసం తెచ్చి అమ్ముతున్నారని , భూపాలపల్లికి చెందిన కొందరు వ్యక్తులు సిరోంచ, తదితర గ్రామాలకు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని బిజినెస్ నడిపిస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలో అంబట్పల్లి సమీపంలో పోలీసులు గతంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని, సూరారం వద్ద వన్యప్రాణుల మాంసం విక్రయి స్తున్న వారిని పోలీసులు పట్టుకుని అటవీశాఖకు అప్పగించిన దాఖలాలు ఉన్నాయి.