కృష్ణకాలనీ, జూన్ 18 : తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు పట్టాలివ్వకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమని లబ్ధిదారులు హెచ్చరించారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని తెగేసి చెప్పారు. భూపాలపల్లి పట్టణంలోని భాస్కర్గడ్డలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన ఇండ్లకు పట్టాలివ్వాలని కొద్దిరోజులుగా లబ్ధిదారులు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇండ్ల ఆవరణలో వంట చేసుకొని అక్కడే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రమేశ్, కుమార్, తుకారాం మాట్లాడుతూ వారం రోజులుగా తాము చేస్తున్న ఆందోళనలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే తమను ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. తమకు పట్టాలివ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే స్పందించి పట్టాలివ్వాలని కోరారు. లేదంటే కుటుంబ సభ్యులతో వచ్చి తమకు కేటాయించిన ఇండ్లల్లోనే నివాసముంటామన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు రమేశ్, రాకేశ్, శారద, లత, ప్రవీణ్, సాయి తదితర 200 మంది పాల్గొన్నారు.