వానలు లేక.. ఎవుసం సాగక అన్నదాత కుదేలవుతున్నాడు. చెరువులు నిండక, ప్రాజెక్టుల నుంచి నీరు రాక ఇబ్బందులు పడుతున్నాడు. వరినాట్ల అదును మొదలైనా.. నారు సిద్ధంగా ఉన్నా.. నాటు వేయలేని దుస్థితి నెలకొంది. అడపా దడపా కురిసిన వర్షాలకు వాణిజ్య పంటల సాగు జోరందుకున్నా.. ప్రధాన ఆహార పంటైన వరికి మాత్రం ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగులో మాత్రమే మెరుగైన వర్షపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో సాధారణంగానే ఉంది. సీజన్ ప్రారంభమై 42 రోజులు గడిచినా ఒక్క భారీ వర్షం కూడా నమోదు కాలేదు. అక్కడక్కడా బోర్లు, బావుల కింద రైతులు నాట్లు వేస్తున్నారు. మరో రెండు వారాల్లో వానలు పడకుంటే నారు ముదురుతుందని, ఆ తర్వాత కురిసినా ఫలితం ఉండదని అన్నదాతలు వాపోతున్నారు.
పంటల సాగుకు రెండో ఏడాదీ ప్రతికూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈసారి కూడా సాధారణ వర్షపాతమే నమోదవుతున్నది. వానలు తక్కువగా ఉండడం, ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో సాగు సరిగా సాగడంలేదు. ఉమ్మ డి వరంగల్ జిల్లాలో అన్ని పంటల సాగు పరిస్థితి ఇలాగే ఉంది. వానకాలం సీజన్ మొదలైన జూన్ 1 నుంచి జూలై 12 వరకు మహబాబాద్ జిల్లాలో 1.54 లక్షల ఎకరాల్లో, వరంగల్లో 1.43 లక్షలు, జనగామలో 1.12 లక్ష లు, జయశంకర్ భూపాలపల్లిలో 91 వేలు, హ నుమకొండలో 84 వేలు, ములుగు జిల్లాలో 18 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ పంటల సాగు విస్తీర్ణం కంటే ఈసారి అన్ని పంటలు తక్కువగానే సాగయ్యాయి.
వానకాలంలో వరి ప్రధాన పంటగా ఉంటుంది. ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తా రు. నీటి వినియోగం అధికంగా ఉండే పంట ఇది. వరుసగా రెండో ఏడాది కూడా సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో వరి విస్తీర్ణంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. గత ఐదారేండ్లలో ఎన్నడూ లేనంత తక్కువ విస్తీర్ణంలో ఈ పంట వేసే పరిస్థితి కనిపిస్తున్నది. ప్ర స్తుతం వరి నాట్ల అదును మొదలుకాగా, నా రు సిద్ధంగా ఉన్నది. సాగునీరు లేకపోవడంతో పొలాలు దున్నేందుకు రైతులు ఇ బ్బందులు పడుతున్నారు. బోర్లు, బావులు ఉన్నవారు నాట్లు వేస్తున్నారు. మరో రెండు వారాల్లోపు సాగునీరు అందకపోతే నారు ముదిరిపోతుంది. ఆ తర్వాత వానలు కురిసినా ఫలితం ఉండదు. వరి విస్తీర్ణం తగ్గితే బియ్యం ఉత్పత్తిపై ప్రభావం పడనున్నది.
వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో రెండో ప్రధాన పంటగా పత్తి ఉంటున్నది. ఈసారి పత్తి రైతుకు విత్తన ఖర్చులు భారీగా అయ్యా యి. తొలకరి వానలు కురవగానే ఎన్నో ఆశలతో పత్తి విత్తనాలు నాటారు. ఆ తర్వాత వానలు పడక, ఎండలు బాగా ఉండడంతో విత్తనాలు మొలకెత్తలేదు. కొద్దిపాటి వానల తర్వాత రెండోసారి విత్తనాలు పెట్టారు. ఈసారి కూడా విత్తనాలు భూమిలోనే పో యాయి. వానలకు అనుగుణంగా రైతులు మూడు నాలుగు సార్లు పత్తి గింజలు పెట్టాల్సి వచ్చింది. ప్రతికూల పరిస్థితిలో మొలిచిన మొక్కలు ఆశించిన మేరకు పెరగడంలేదు. వీటిని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
