ఖిలావరంగల్: ఇంట్లో ఎవరు లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు దగ్ధమైంది. ఇంటిలోని గృహప్రకారణాలు దుస్తులతో సహా ఫర్నిచర్ కాలి బూడిదయింది. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున శివనగర్ లో జరిగింది. బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. శివనగర్ రుద్రమాంబ నగర్ కు చెందిన ఏటూరి పారిజాతం, దేవేంద్రాచారి దంపతులు అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ దవాఖానకు వెళ్లారు. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇంటిలో నుంచి పొగలు వస్తుండడం గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు.
తలుపులు పగలగొట్టి మంటలను ఆర్పివేసి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. అయితే అప్పటికే ఇంటిలోని గృహపకరణాలు, దుస్తులు తదితర వస్తువులన్నీ కాలిపోయాయి. బాధితులు హుటాహుటిన వరంగల్ కు చేరుకొని ఇంటి పరిస్థితిని చూసి రోదించారు. కట్టు బట్టలు మినహా సర్వం కాలిపోయాయని కన్నీటి పర్యంతమయ్యారు. అగ్ని ప్రమాదంలో ఇంటి పైకప్పు రేకులు కూడా కాలిపోగా నిలువ నీడ కూడా లేదని ఆవేదన చెందారు.
ప్రభుత్వం స్పందించి తగిన నష్ట పరిహారం అందించాలని బాధితులు స్థానికులు కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా విషయం తెలిసి స్థానిక నాయకులు మెరుగు అశోక్ బాధితులను పరామర్శించారు. రూ 10,000 ఆర్థిక సాయం అందజేశారు. అలాగే గడ్డం రవి 50 కిలోల బియ్యం అందజేశారు. ప్రభుత్వం స్పందించి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటి తో పాటు ఆర్థిక సాయం అందజేయాలని కోరారు.