నర్సింహులపేట, ఫిబ్రవరి 24: మండలంలోని కొమ్ములవంచ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో దాతల సహకారంతో జాతీయ నాయకుల చిత్రాలను వేసి సుందరంగా తీర్చిదిద్దారు. ప్రహరీపై వేసిన రైలు చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. విద్యార్థులకు తాగునీటిని అందుబాటులోకి తెచ్చారు. బాల బాలిలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు. మధ్యాహ్న భోజనం వండేందుకు ప్రత్యేకంగా షెడ్డు నిర్మించారు. విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గతంలో గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపేందుకు ముఖం చాటేసేవారు. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన బోధన అందుతుండడం, మెరుగైన ఫలితాలు వస్తుండడంతో ఆసక్తి చూపుతున్నారు. పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నా 6వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమం అమలవుతుండడంతో ఆడ్మిషన్లు ఏటేటా పెరుగుతున్నాయి. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు కూడా ఆర్థికంగా సహకరిస్తున్నారు. గ్రామానికి చెందిన జాటోత్ రామారావు ప్రొజెక్టర్ అందించారు. రేపోణి లీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్లు సమకూర్చారు. ప్రహరీ, తరగతి గదుల గోడలపై మహనీయుల చిత్రాలు వేయించి స్ఫూర్తినిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమం గొప్పది. ఇది కచ్చితంగా విజయవంతమై విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పిల్లలందరికీ మెరుగైన విద్య అందుతుంది. మరోవైపు పాఠశాలల్లో అదనపు గదులు, మరుగుదొడ్లు, బెంచీలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
– రవీంద్రాచారి, హెచ్ఎం
మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే ఇప్పుడు నేను ఇంగ్లిష్ మీడియంలో 5వ తరగతి చదువుతున్న. వేరే ఊరిలో ప్రైవేట్ పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆరో తరగతి తర్వాత ప్రైవేట్ పాఠశాలకు వెళ్లాల్సివస్తుందేమోనని భయపడ్డా. ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తుండడంతో ఇప్పుడు బాధలేదు.
– వశంశెట్టి అక్షిత, 5వ తరగతి
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం ద్వారా పేద విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమం ఉండడంతో నిరుపేదలు వేలకు వేలు ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం అందించాలని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని వర్గాల పిల్లలు సర్కారు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని ఉన్నతంగా ఎదుగుతారు.
– శ్రీనివాస్, ఉపాధ్యాయుడు