కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కుట్రలను, తన కనుసన్నల్లో వేసిన ఘోష్ కమిషన్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎదురొడ్డి గెలిచింది. ఇప్పటి వరకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అబద్ధపు ప్రచారాలను పటాపంచలు చేసింది. ఘోష్ కమిషన్ నివేదికను పక్కనపెడుతూ, దీని ఆధారంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టులా మారింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు. కేసీఆర్ కటౌట్, చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని కుతంత్రాలు చేసినా న్యాయమే గెలిచిందన్నారు.
లింగాలఘనపురం, ఏప్రిల్ 22 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం సంబురాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో బీఆర్ఎస్ మండల కన్వీనర్ శేఖర్, మాజీ అధ్యక్షుడు వీరన్న ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో కేసీఆర్ కడిగిన ముత్యమని రుజువైందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కేమిడి వెంకటేశ్, మాజీ కోఆఫ్షన్ సభ్యుడు ఎండీ జానీమియా, నాయకులు గండి యాదగిరి, బెజ్జం చంద్రయ్య, కేమిడి యాదగిరి, బాల్నె సత్యనారాయణ, లింగాల వెంకటేశ్, టంగుటూరి నర్సయ్య, జాగిళ్లపురం అబ్బులు, బెజ్జం అశోక్, గంగుల బాలయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ, ఏప్రిల్ 22 : హైకోర్టు తీర్పు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలకు చెక్ పెట్టిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. బుధవారం పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో బీడుపడిన నేలలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం మీద కాంగ్రెస్ విషం చిమ్మడమే పనిగా పెట్టుకొందన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, ఎసే జోషీపై కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోరాదని హైకోర్టు తీర్పు ఇవ్వడం హార్షనీయమన్నారు. ఆర్టీసీ కార్మికులకు సైతం కాంగ్రెస్ మొండిచేయి చూపిందన్నారు. ఎన్నికల ముందు ఖాళీ బాండ్ పేపర్ మీద సంతకం చేసినట్టు అడ్డగోలు హామీలిచ్చి నయవంచన చేయడం బాధాకరమన్నారు. ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి చర్చలు అంటున్నారంటే ప్రజా పాలన పగిలిపోయిందా? మంత్రులు మెకడంలో, రేవంత్‌రెడ్డి డిల్లీకి మూటలు మోయడంలో బిజీగా ఉన్నారా? అని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి
ములుగు, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ వేశారని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు అన్నారు. ఈ కమిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, వారి కుట్రలకు చెంప పెట్టులాంటిదన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కనుసన్నల్లో సాగే విచారణలకు కాలం చెల్లిందని తీర్పు ద్వారా నిరూపితమైందన్నారు. ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేస్తున్న విష ప్రచారాన్ని, కుట్రలను తీర్పు భగ్నం చేసిందన్నారు.
కోట్లాది మంది రైతుల భూములకు సాగు నీరందించేందుకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు జీవనాడి లాంటిందన్నారు. కేసీఆర్ ఎంతో దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అభాసుపాలు చేయాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కక్షపూరిత, డైవర్షన్ రాజకీయాలు మానుకొని ప్రాజెక్టుల నిర్వాహణతో పాటు ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని హితవు పలికారు. సత్యమే గెలిచిందని, కాళేశ్వరం ప్రాజెక్టు సగర్వంగా నిలబడిందన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మస్రగాని వినయ్‌కుమార్, నాయకులు మల్లారెడ్డి, ప్రదీప్‌రావు, సర్దార్ పాషా, నవీన్ తదితరులున్నారు.
-బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు